దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
వారిలో పలువురు విద్యార్థులు
చిల్లకూరు:కోట-గూడూరు మార్గంలోని చీమలతిప్ప వద్ద ఈ నెల 21వ తేదీ సబ్బుల వ్యాపారిని ఆపి రూ.2.30 లక్షలతో పాటు, బైక్‌ను దోచుకున్న కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2 లక్షలు నగదు, స్కూటర్‌తో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ శనివారం చిల్లకూరు పోలీసుస్టేషన్లో విలేకరులకు వివరించారు.
ఆయన కథనం మేరకు..గూడూరుకు చెందిన శ్రీనివాసులు సబ్బుల వ్యాపారం చేస్తాడు. ఆయన కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని దుకాణాలకు సబ్బులు సరఫరా చేసి నగదు వసూలు చేస్తుంటాడు. ఇది కోటకు చెందిన షాహుల్ గమనించి తన స్నేహితులతో కలిసి ఓ పర్యాయం ఆయనపై దాడికి పాల్పడ్డాడు.
అప్పట్లో ఆయన తప్పించుకోవడంతో మరోదఫా స్నేహితులతో కలిసి పక్కా వ్యూహరచన చేసి ఈ నెల 21న చిల్లకూరు మండల పరిధిలోని చీమలతిప్ప వద్ద అడ్డగించారు. శ్రీనివాసులు వద్ద ఉన్న రూ.2.30 లక్షల నగదుతో పాటు హోండా యాక్టివా స్కూటర్‌ను దోచుకున్నారు. ఈ కేసును గూడూరు రూరల్, వాకాడు, నాయుడుపేట సీఐలు మధుసూదన్‌రావు, కరుణాకర్, అక్కేశ్వరరావు, చిల్లకూరు ఎస్సై దశరథరామారావు ఛాలెంజ్‌గా తీసుకుని వివిధ కోణాల్లో విచారించారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను మధుసూదన్‌రావు గుర్తించారు. మొదట నాయుడుపేటకు చెందిన ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు కోటకు చెందిన షాహుల్ పేరు చెప్పాడు. షాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితులైన కోటకు చెందిన పఠాన్ రఫీ, నాయుడుపేటకు చెందిన వంశీకృష్ణతో పాటు నవాబుపేటకు చెందిన లక్ష్మీకాంత్, కల్యాణ్, అరుణ్, తరుణ్, ప్రవీణ్, సుమన్‌బాబు దోపిడీలో సహకరించినట్లు వెల్లడించాడు.
అందరినీ అరెస్ట్ చేసి రూ.2 లక్షల నగదు, స్కూటర్, సెల్‌ఫోన్ స్వాదీనం చేసుకున్నారు. షాహుల్, వంశీ, లక్ష్మీకాంత్ గూడూరు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో చేస్తున్నారు. కల్యాణ్, తరుణ్ నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతుండగా అరుణ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ప్రవీణ్ నెల్లూరులో ఎద్దుల బండితో ఇసుక వ్యాపారం చేస్తుండగా రఫీ కోటలో ఆటోడ్రైవర్. ఉస్మాన్ బ్యాటరీ వర్కర్ కాగా, సుమన్ చిల్లర దుకాణంలో పనిచేస్తున్నాడు. వీళ్లందరూ స్నేహితులు. కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐలు, ఎస్సైతో పాటు ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.