Roberta Vinci
-
పెనెట్టాకే పట్టం
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా ఫైనల్లో రొబెర్టా విన్సీపై విజయం రూ. 21 కోట్ల 86 లక్షల ప్రైజ్‌మనీ సొంతం కెరీర్ ఆసాంతం ఎందరినో అందని ద్రాక్షలా ఊరించే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తొలి అవకాశంలోనే సాధిస్తే ఆ అనుభూతి అనిర్వచనీయం. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వచ్చిన ఇటలీ ప్లేయర్ ఫ్లావియా పెనెట్టా ఆఖరి మెట్టునూ సగర్వంగా దాటింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెద్ద వయస్సులో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 33 ఏళ్ల పెనెట్టా ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించింది. న్యూయార్క్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని వృథా చేసుకోకుండా ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) అనుకున్న ఫలితాన్ని సాధించింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 26వ సీడ్ పెనెట్టా 7-6 (7/4), 6-2తో అన్‌సీడెడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన పెనెట్టాకు 33 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల 86 లక్షలు), రన్నరప్ విన్సీకి 16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► జూనియర్ స్థాయి నుంచి విన్సీతో కలిసి ఆడిన అనుభవం ఉన్న పెనెట్టా ఫైనల్లో నిలకడగా రాణించింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ అంతిమ సమరంలో తొలి సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో పెనెట్టా పైచేయి సాధించింది. ఇక రెండో సెట్లో పెనెట్టా ఆరంభం నుంచే జోరు పెంచింది. రెండుసార్లు విన్సీ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని దక్కించుకుంది. ► మ్యాచ్ మొత్తంలో పెనెట్టా నాలుగు ఏస్‌లు సంధించి, 28 విన్నర్స్ కొట్టింది. విన్సీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకుంది. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు సంపాదించింది. ► సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన విన్సీ ఫైనల్లో మాత్రం అదే ఆటతీరును పునరావృతం చేయలేకపోయింది. తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా, రెండో సెట్కొచ్చేసరికి విన్సీ డీలా పడింది. ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయిన ఆమె 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ► ఫ్రాన్సెస్కా షియవోని (2010 ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఇటలీ తరఫున మహిళల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా పెనెట్టా నిలిచింది. ఫైనల్‌కు చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా కూడా పెనెట్టా (33 ఏళ్లు) గుర్తింపు పొందింది. 29 ఏళ్లతో షియవోని పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ► ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లో ఇటలీకి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఫైనల్‌కు ప్రత్యక్షంగా వీక్షించేందుకు హాజరైన 23,771 మంది ప్రేక్షకుల్లో ఇటలీ ప్రధానమంత్రి మటెవో రెంజితో సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ► తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (49) తీసుకున్న ప్లేయర్‌గా కూడా పెనెట్టా నిలిచింది. 47 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మరియన్ బర్తోలీ (ఫ్రాన్స్-2013 వింబుల్డన్) పేరిట ఉన్న ఈ రికార్డును పెనెట్టా సవరించింది. ► ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న పెద్ద వయస్కులుగా పెనెట్టా, విన్సీ (ఇద్దరిది కలిపితే 66 ఏళ్ల 19 రోజులు) గుర్తిం పు పొందారు. దాంతో 63 ఏళ్ల 11 నెలలతో వర్జినియా వేడ్, బెట్టీ స్టవ్‌ల పేరిట (1977 వింబుల్డన్) ఉన్న రికార్డు తెరమరుగైంది. ► {పపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-25లో లేని క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గడం ఇది ఏడోసారి మాత్రమే. గతంలో వీనస్ విలియమ్స్ (ర్యాంక్ 31; 2007 వింబుల్డన్), బార్బరా (ర్యాంక్ 68; 1979 ఆస్ట్రేలియన్ ఓపెన్), సెరెనా (ర్యాంక్ 81; 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్), క్రిస్ ఓనీల్ (ర్యాంక్ 111; 1978 ఆస్ట్రేలియన్ ఓపెన్), గూలాగాంగ్ (ర్యాంక్ లేదు; 1977 ఆస్ట్రేలియన్ ఓపెన్), క్లియ్‌స్టర్స్ (ర్యాంక్ లేదు; 2009 యూఎస్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం 26వ ర్యాంక్‌లో ఉన్న పెనెట్టా తాజా ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకుతుంది. కల నిజం కావడమంటే ఇదేనేమో. జూనియర్ స్థాయిలో ఉన్నపుడు ఏనాటికైనా నంబర్‌వన్ కావాలని, కనీసం ఒకసారైనా గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కావాలని కలలు కన్నాను. ఈరోజు అది నిజమైంది. ప్రస్తుతం నేనెంతో సంతోషంగా ఉన్నాను. యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగకముందే ఈ ఏడాది చివర్లో ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ఏడాది మరో రెండు టోర్నీలు మాత్రమే ఆడతాను. విజయం సాధించాలంటే నిరంతరం పోరాడాలి. దానికి ఎంతో శక్తి కావాలి. ఒక్కోసారి నాలో ఆ శక్తి లేదనిపిస్తోంది. అందుకే ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. -పెనెట్టా సెరెనాను ఓడించాక 24 గంటలు నాలో ఎన్నో ఆలోచనలు కలిగాయి. కాస్త అలసిపోయాను కూడా. ఫైనల్లో ఓడిపోయినా ఆనందంగానే ఉన్నాను. సుదీర్ఘ కాలం నుంచి పరిచయమున్న క్రీడాకారిణితో ఆడటం సులువేంకాదు. పెనెట్టా విజేతగా నిలిచినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. -రొబెర్టా విన్సీ -
ఒక రికార్డు మిస్సైంది.. మరో రికార్డు బ్రేక్ చేస్తుందా..!
యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభంలో ఈ రికార్డు గురించి ఎవ్వరూ ఆలోచించి ఉండరు. టెన్సిస్ ఓనమాలు తెలియని.. న్యూయార్కర్ల నుంచి క్రీడాపండితుల వరకూ అంతా సెరెనా.. క్యాలెండర్ స్లామ్ గురించే మాట్లాడారు. ఇటాలియన్ భామ రొబెర్ట్ విన్సీ ఓడి పోడంతో.. అమెరికన్ లు అంతా.. మహిళల సింగిల్స్ గురించి చర్చించుకోవడం మానేశారు. అయితే.. న్యూయార్క్ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం జరిగే.. ఆల్ ఇటాలియన్ ఉమెన్స్ ఫైనల్ లో మరో రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో పెన్నెట్టా గెలిస్తే.. గ్రాండ్స్ స్లామ్ మహిళల ఛాంపియన్ షిప్ చరిత్రలో.. అత్యధిక ప్రయత్నాల తర్వాత టైటిల్ గెలిచిన రికార్డు సాధిస్తుంది. 49 గ్రాండ్ స్లామ్ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న పెన్నెటా.. తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ కు చేరింది. గతంలో ఈ రికార్డు ఫ్రెంచ్ ప్లేయర్ మారియన్ బర్టోలీ(47) పేరిట ఉంది. కాగా.. మారియన్ కంటే.. పెన్నెటా రెండు టోర్నీ(49)లు అధికంగా తీసుకుంది. హెడ్ టు హెడ్ రికార్డులు కూడా పెన్నెటా కి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు పెన్నెటా, విన్సీలు ముఖా ముఖి తలపడగా.. 5 సార్లు పెన్నెటా గెలుపొందింది. మరి యూఎస్ ఓపెన్ లో పెన్నెటా రికార్డు సృష్టిస్తుందో.. విన్సీ లెక్క సరిచేసి.. చరిత్ర సృష్టిస్తుందో మరికాసేపట్లో తేలనుంది. -
ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేతలు
-
కల చెదిరింది..
క్యాలెండర్ స్లామ్ కల చెదిరింది ♦ యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరెనాకు షాక్ ♦ అన్‌సీడెడ్ విన్సీ చేతిలో అనూహ్య ఓటమి ♦ మరో సెమీస్‌లో హలెప్ కూడా పరాజయం ♦ ఫైనల్లో విన్సీతో పెన్నెటా ఢీ ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ నిర్మించుకున్న ఆశలసౌథం ఆఖరి క్షణంలో కుప్పకూలితే... చరిత్ర సృష్టించడానికి రెండడుగుల దూరంలోకి వచ్చాక ఓ అనామకురాలు అశనిపాతంలా అడ్డుపడితే... గుండెలు పిండేసినట్లు ఉంటుంది. కన్నీరు కట్టలు తెంచుకుంటుంది. తేరుకోవడానికి జీవితకాలం సరిపోదు... ఇప్పుడు అమెరికా టెన్నిస్ స్టార్ ఇదే బాధను అనుభవిస్తోంది. ఏడాది పాటు టెన్నిస్ ప్రపంచంలో అడ్డొచ్చిన ప్రతి క్రీడాకారిణినీ చిత్తు చేసి... 27 ఏళ్ల తర్వాత క్యాలెండర్ స్లామ్ గెలిచిన రికార్డుకు రెండు అడుగుల దూరంలో... అనూహ్యంగా నల్లకలువకు షాక్ తగిలింది. విన్సీ అనే అన్‌సీడెడ్ క్రీడాకారిణి చేతిలో యూఎస్ ఓపెన్ సెమీస్‌లో ఓడిపోయింది. న్యూయార్క్ : బలమైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నా... మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెలరేగిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి రొబెర్ట్ విన్సీ (ఇటలీ)... యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించింది. ఎన్నో అశలతో బరిలోకి దిగిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు సెమీస్‌లో షాకిస్తూ... టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో విన్సీ 2-6, 6-4, 6-4తో సెరెనాపై అద్భుత విజయాన్ని సాధించింది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన పోరాటంలో ఊహించని రీతిలో పుంజుకున్న విన్సీ రెండో సెట్ నుంచి సెరెనాకు ముచ్చెమటలు పట్టించింది. తొలిసెట్ ఆరంభంలో ఇద్దరూ దూకుడుగా ఆడటంతో 1-1తో స్కోరు సమమైంది. మూడో గేమ్‌లో బేస్‌లైన్ ఆటకు ప్రాధాన్యం ఇచ్చిన సెరెనా కాస్త వెనుకబడి గేమ్‌ను కోల్పోయింది. 2-1 ఆధిక్యంతో నాలుగో గేమ్‌ను మొదలుపెట్టిన వీన్సి అనూహ్యంగా సర్వీస్‌ను కోల్పోవడంతో స్కోరు 2-2తో సమమైంది. ఇక ఐదో గేమ్‌లో తిరుగులేని షాట్లతో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సెరెనా... ఆరో గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకుని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. దీంతో అమెరికన్ ఆధిక్యం 4-2కు పెరిగింది. ఏడో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకున్న సెరెనా.. ఎనిమిదో గేమ్‌లో విన్సీ కొట్టిన బంతి బేస్‌లైన్ దాటడంతో సెట్‌ను చేజిక్కించుకుంది. రెండో సెట్లో 2-4తో వెనుకబడిన సెరెనా పుంజుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. సర్వీస్‌లో లోపాలను అధిగమించిన విన్సీ అద్భుతమైన షాట్లతో అలరించింది. ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్ నిలబెట్టుకున్నా.. తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకుని 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేయలేకపోయిన విన్సీ పదో గేమ్‌లో సర్వీస్‌ను కాచుకుని సెట్‌ను దక్కించుకుంది. మూడో సెట్ తొలి గేమ్‌లో సర్వీస్ కాపాడుకున్న సెరెనా..తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన విన్సీ నాలుగో గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకోవడంతో స్కోరు 2-2తో సమమైంది. ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకుని 3-2 ఆధిక్యంలోకి వెళ్లినా.. తర్వాతి గేమ్‌ను విన్సీ నిలబెట్టుకోవడంతో మళ్లీ స్కోరు 3-3తో సమమైంది. అనూహ్యంగా ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కోల్పోయింది. ఎనిమిదో గేమ్‌లో విన్సీ సర్వీస్‌ను నిలబెట్టుకుని 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకున్నా.... పదో గేమ్‌లో విన్సీ సర్వీస్‌ను కాచుకుని సెట్‌ను గేమ్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా సెరెనా 33 మ్యాచ్‌ల జైత్రయాత్రకు ఈ విజయంతో విన్సీ అడ్డుకట్ట వేసింది. పెన్నెటా అలవోకగా... మరో సెమీస్‌లో రెండోసీడ్‌గా బరిలోకి దిగిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌కు.. 26వ సీడ్ ఫ్లావియా పెన్నెటా (ఇటలీ) షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో పెన్నెటా 6-1, 6-3తో హలెప్‌పై సంచలన విజయం సాధించింది. దీంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన తొలి ఇటలీ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెన్నెటా స్ఫూర్తిదాయకంగా ఆడింది. ప్రత్యర్థి ఫేవరెట్‌గా బరిలోకి దిగినా... ఎక్కడా తడబడకుండా మ్యాచ్‌ను ముగించింది. బలమైన సర్వీస్‌కు తోడు అద్భుతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో అలరించిన పెన్నెటా తొలి సెట్ నాలుగో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి మూడు గేమ్‌ల్లో రెండుసార్లు సర్వీస్‌ను కాచుకుని మరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో హలెప్ కాస్త పుంజుకునే ప్రయత్నం చేసింది. స్కోరు 1-1 తర్వాత మూడో గేమ్‌లో పెన్నెటా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ వెంటనే సర్వీస్‌ను కాచుకుని 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశ నుంచి హలెప్ ఆట గాడి తప్పింది. అప్పటి వరకు సర్వీస్‌లో నిలకడ చూపిన రొమేనియా అమ్మాయి ఆ తర్వాత తడబడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పెన్నెటా చెలరేగి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది.