కల చెదిరింది.. | Shock to Serena in the semis of the US Open | Sakshi
Sakshi News home page

కల చెదిరింది..

Published Sat, Sep 12 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

కల చెదిరింది..

కల చెదిరింది..

క్యాలెండర్ స్లామ్ కల చెదిరింది

♦ యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరెనాకు షాక్
♦ అన్‌సీడెడ్ విన్సీ చేతిలో అనూహ్య ఓటమి
♦ మరో సెమీస్‌లో హలెప్ కూడా పరాజయం
♦ ఫైనల్లో విన్సీతో పెన్నెటా ఢీ
 
 ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ నిర్మించుకున్న ఆశలసౌథం ఆఖరి క్షణంలో కుప్పకూలితే...
 చరిత్ర సృష్టించడానికి రెండడుగుల దూరంలోకి వచ్చాక ఓ అనామకురాలు అశనిపాతంలా అడ్డుపడితే...
 గుండెలు పిండేసినట్లు ఉంటుంది. కన్నీరు కట్టలు తెంచుకుంటుంది. తేరుకోవడానికి జీవితకాలం సరిపోదు...


 ఇప్పుడు అమెరికా టెన్నిస్ స్టార్ ఇదే బాధను అనుభవిస్తోంది.  ఏడాది పాటు టెన్నిస్ ప్రపంచంలో అడ్డొచ్చిన ప్రతి క్రీడాకారిణినీ చిత్తు చేసి... 27 ఏళ్ల తర్వాత క్యాలెండర్ స్లామ్ గెలిచిన రికార్డుకు రెండు అడుగుల దూరంలో... అనూహ్యంగా నల్లకలువకు షాక్ తగిలింది. విన్సీ అనే అన్‌సీడెడ్ క్రీడాకారిణి చేతిలో యూఎస్ ఓపెన్ సెమీస్‌లో ఓడిపోయింది.
 
 న్యూయార్క్ : బలమైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నా... మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెలరేగిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి రొబెర్ట్ విన్సీ (ఇటలీ)... యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించింది. ఎన్నో అశలతో బరిలోకి దిగిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు సెమీస్‌లో షాకిస్తూ... టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో విన్సీ 2-6, 6-4, 6-4తో సెరెనాపై అద్భుత విజయాన్ని సాధించింది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన పోరాటంలో ఊహించని రీతిలో పుంజుకున్న విన్సీ రెండో సెట్ నుంచి సెరెనాకు ముచ్చెమటలు పట్టించింది.

తొలిసెట్ ఆరంభంలో ఇద్దరూ దూకుడుగా ఆడటంతో 1-1తో స్కోరు సమమైంది. మూడో గేమ్‌లో బేస్‌లైన్ ఆటకు ప్రాధాన్యం ఇచ్చిన సెరెనా కాస్త వెనుకబడి గేమ్‌ను కోల్పోయింది. 2-1 ఆధిక్యంతో నాలుగో గేమ్‌ను మొదలుపెట్టిన వీన్సి అనూహ్యంగా సర్వీస్‌ను కోల్పోవడంతో స్కోరు 2-2తో సమమైంది. ఇక ఐదో గేమ్‌లో తిరుగులేని షాట్లతో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సెరెనా... ఆరో గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకుని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. దీంతో అమెరికన్ ఆధిక్యం 4-2కు పెరిగింది. ఏడో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకున్న సెరెనా.. ఎనిమిదో గేమ్‌లో విన్సీ కొట్టిన బంతి బేస్‌లైన్ దాటడంతో సెట్‌ను చేజిక్కించుకుంది.

 రెండో సెట్‌లో 2-4తో వెనుకబడిన సెరెనా పుంజుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. సర్వీస్‌లో లోపాలను అధిగమించిన విన్సీ అద్భుతమైన షాట్లతో అలరించింది. ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్ నిలబెట్టుకున్నా.. తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకుని 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేయలేకపోయిన విన్సీ పదో గేమ్‌లో సర్వీస్‌ను కాచుకుని సెట్‌ను దక్కించుకుంది. మూడో సెట్ తొలి గేమ్‌లో సర్వీస్ కాపాడుకున్న సెరెనా..తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

అయితే మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన విన్సీ నాలుగో గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకోవడంతో స్కోరు 2-2తో సమమైంది. ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకుని 3-2 ఆధిక్యంలోకి వెళ్లినా.. తర్వాతి గేమ్‌ను విన్సీ నిలబెట్టుకోవడంతో మళ్లీ స్కోరు 3-3తో సమమైంది. అనూహ్యంగా ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కోల్పోయింది. ఎనిమిదో గేమ్‌లో విన్సీ సర్వీస్‌ను నిలబెట్టుకుని 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకున్నా.... పదో గేమ్‌లో విన్సీ సర్వీస్‌ను కాచుకుని సెట్‌ను గేమ్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా సెరెనా 33 మ్యాచ్‌ల జైత్రయాత్రకు ఈ విజయంతో విన్సీ అడ్డుకట్ట వేసింది.

 పెన్నెటా అలవోకగా...
 మరో సెమీస్‌లో రెండోసీడ్‌గా బరిలోకి దిగిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌కు.. 26వ సీడ్ ఫ్లావియా పెన్నెటా (ఇటలీ) షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో పెన్నెటా 6-1, 6-3తో హలెప్‌పై సంచలన విజయం సాధించింది. దీంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన తొలి ఇటలీ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెన్నెటా స్ఫూర్తిదాయకంగా ఆడింది.

ప్రత్యర్థి ఫేవరెట్‌గా బరిలోకి దిగినా... ఎక్కడా తడబడకుండా మ్యాచ్‌ను ముగించింది. బలమైన సర్వీస్‌కు తోడు అద్భుతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో అలరించిన పెన్నెటా తొలి సెట్ నాలుగో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి మూడు గేమ్‌ల్లో రెండుసార్లు సర్వీస్‌ను కాచుకుని మరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌లో హలెప్ కాస్త పుంజుకునే ప్రయత్నం చేసింది. స్కోరు 1-1 తర్వాత మూడో గేమ్‌లో పెన్నెటా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ వెంటనే సర్వీస్‌ను కాచుకుని 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశ నుంచి హలెప్ ఆట గాడి తప్పింది. అప్పటి వరకు సర్వీస్‌లో నిలకడ చూపిన రొమేనియా అమ్మాయి ఆ తర్వాత తడబడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పెన్నెటా చెలరేగి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement