పెనెట్టాకే పట్టం
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా
ఫైనల్లో రొబెర్టా విన్సీపై విజయం
రూ. 21 కోట్ల 86 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
కెరీర్ ఆసాంతం ఎందరినో అందని ద్రాక్షలా ఊరించే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తొలి అవకాశంలోనే సాధిస్తే ఆ అనుభూతి అనిర్వచనీయం. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వచ్చిన ఇటలీ ప్లేయర్ ఫ్లావియా పెనెట్టా ఆఖరి మెట్టునూ సగర్వంగా దాటింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెద్ద వయస్సులో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 33 ఏళ్ల పెనెట్టా ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించింది.
న్యూయార్క్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని వృథా చేసుకోకుండా ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) అనుకున్న ఫలితాన్ని సాధించింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 26వ సీడ్ పెనెట్టా 7-6 (7/4), 6-2తో అన్‌సీడెడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన పెనెట్టాకు 33 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల 86 లక్షలు), రన్నరప్ విన్సీకి 16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
► జూనియర్ స్థాయి నుంచి విన్సీతో కలిసి ఆడిన అనుభవం ఉన్న పెనెట్టా ఫైనల్లో నిలకడగా రాణించింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ అంతిమ సమరంలో తొలి సెట్‌లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో పెనెట్టా పైచేయి సాధించింది. ఇక రెండో సెట్‌లో పెనెట్టా ఆరంభం నుంచే జోరు పెంచింది. రెండుసార్లు విన్సీ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని దక్కించుకుంది.
► మ్యాచ్ మొత్తంలో పెనెట్టా నాలుగు ఏస్‌లు సంధించి, 28 విన్నర్స్ కొట్టింది. విన్సీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకుంది. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు సంపాదించింది.
► సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన విన్సీ ఫైనల్లో మాత్రం అదే ఆటతీరును పునరావృతం చేయలేకపోయింది. తొలి సెట్‌లో గట్టిపోటీనిచ్చినా, రెండో సెట్‌కొచ్చేసరికి విన్సీ డీలా పడింది. ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయిన ఆమె 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
► ఫ్రాన్సెస్కా షియవోని (2010 ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఇటలీ తరఫున మహిళల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా పెనెట్టా నిలిచింది. ఫైనల్‌కు చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా కూడా పెనెట్టా (33 ఏళ్లు) గుర్తింపు పొందింది. 29 ఏళ్లతో షియవోని పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది.
► ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లో ఇటలీకి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఫైనల్‌కు ప్రత్యక్షంగా వీక్షించేందుకు హాజరైన 23,771 మంది ప్రేక్షకుల్లో ఇటలీ ప్రధానమంత్రి మటెవో రెంజితో సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
► తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (49) తీసుకున్న ప్లేయర్‌గా కూడా పెనెట్టా నిలిచింది. 47 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మరియన్ బర్తోలీ (ఫ్రాన్స్-2013 వింబుల్డన్) పేరిట ఉన్న ఈ రికార్డును పెనెట్టా సవరించింది.
► ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న పెద్ద వయస్కులుగా పెనెట్టా, విన్సీ (ఇద్దరిది కలిపితే 66 ఏళ్ల 19 రోజులు) గుర్తిం పు పొందారు. దాంతో 63 ఏళ్ల 11 నెలలతో వర్జినియా వేడ్, బెట్టీ స్టవ్‌ల పేరిట (1977 వింబుల్డన్) ఉన్న రికార్డు తెరమరుగైంది.
► {పపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-25లో లేని క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గడం ఇది ఏడోసారి మాత్రమే. గతంలో వీనస్ విలియమ్స్ (ర్యాంక్ 31; 2007 వింబుల్డన్), బార్బరా (ర్యాంక్ 68; 1979 ఆస్ట్రేలియన్ ఓపెన్), సెరెనా (ర్యాంక్ 81; 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్), క్రిస్ ఓనీల్ (ర్యాంక్ 111; 1978 ఆస్ట్రేలియన్ ఓపెన్), గూలాగాంగ్ (ర్యాంక్ లేదు; 1977 ఆస్ట్రేలియన్ ఓపెన్), క్లియ్‌స్టర్స్ (ర్యాంక్ లేదు; 2009 యూఎస్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం 26వ ర్యాంక్‌లో ఉన్న పెనెట్టా తాజా ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకుతుంది.
కల నిజం కావడమంటే ఇదేనేమో. జూనియర్ స్థాయిలో ఉన్నపుడు ఏనాటికైనా నంబర్‌వన్ కావాలని, కనీసం ఒకసారైనా గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కావాలని కలలు కన్నాను. ఈరోజు అది నిజమైంది. ప్రస్తుతం నేనెంతో సంతోషంగా ఉన్నాను. యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగకముందే ఈ ఏడాది చివర్లో ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ఏడాది మరో రెండు టోర్నీలు మాత్రమే ఆడతాను. విజయం సాధించాలంటే నిరంతరం పోరాడాలి. దానికి ఎంతో శక్తి కావాలి. ఒక్కోసారి నాలో ఆ శక్తి లేదనిపిస్తోంది. అందుకే ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.
-పెనెట్టా
సెరెనాను ఓడించాక 24 గంటలు నాలో ఎన్నో ఆలోచనలు కలిగాయి. కాస్త అలసిపోయాను కూడా. ఫైనల్లో ఓడిపోయినా ఆనందంగానే ఉన్నాను. సుదీర్ఘ కాలం నుంచి పరిచయమున్న క్రీడాకారిణితో ఆడటం సులువేంకాదు. పెనెట్టా విజేతగా నిలిచినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
-రొబెర్టా విన్సీ