ముంబై మాస్టర్స్ కు పెనెట్టా
నవంబరు-డిసెంబరులో చాంపియన్స్ టెన్నిస్ లీగ్-2
ముంబై : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా భారత్‌కు రానుంది. ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన అనంతరం వ్యాఖ్యానించిన ఈ ఇటలీ స్టార్... భారత్‌లో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో బరిలోకి దిగనుంది. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగే సీటీఎల్-2లో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఫ్లావియా పెనెట్టా ముంబై మాస్టర్స్ జట్టు తరఫున పాల్గొంటుంది. సీటీఎల్-2కు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విజయ్ అమృత్‌రాజ్ వెల్లడించారు.
►ఈ ఏడాది సీటీఎల్-2 నవంబరు 23 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది. భారత్‌లోని ఆరు నగరాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు.
►ముంబై, హైదరాబాద్, చండీగఢ్, రాయ్‌పూర్, నాగ్‌పూర్ ఫ్రాంచైజీలు ఖరారు కాగా... పది రోజుల్లోపు ఆరో ఫ్రాంచైజీగా పుణే, చెన్నై, బెంగళూరులలో ఒకటిని ఎంపిక చేస్తారు.
►విజేత జట్టుకు రూ. కోటి... రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ అందజేస్తారు.
►పురుషుల టెన్నిస్‌లో అత్యంత పొడగరి ఆటగాడు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా-6 అడుగుల 11 అంగుళాలు) హైదరాబాద్ ఏసెస్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. ఇటీవల యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన దక్షిణాఫ్రికా ప్లేయర్ కెవిన్ అండర్సన్ రాయ్‌పూర్ జట్టుకు ఆడతాడు.
►స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ హైదరాబాద్ ఏసెస్ జట్టులోనే కొనసాగనుంది. హింగిస్‌తోపాటు జెలెనా జంకోవిచ్ (సెర్బియా), అలీజా కార్నె (ఫ్రాన్స్), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), హీతెర్ వాట్సన్ (బ్రిటన్) కూడా సీటీఎల్-2లో ఆడనున్నారు.
►{పతి జట్టులో భారత సీనియర్ క్రీడాకారుడితోపాటు ఇద్దరు జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. సీనియర్ ఆటగాళ్లు సాకేత్ మైనేని, జీవన్ నెదున్‌చెజియాన్, శ్రీరామ్ బాలాజీ, దివిజ్ శరణ్, రామ్‌కుమార్ రామనాథన్, విష్ణువర్ధన్ ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు.
►{పతి పోటీలో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. లెజెండ్స్, ఏటీపీ ప్లేయర్, డబ్ల్యూటీఏ ప్లేయర్ సింగిల్స్ మ్యాచ్‌లు... పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. క్రితంసారి ఒక్కో సెట్‌లో ఆరు గేమ్‌లు ఉండగా.. ఈసారి దానిని ఐదుకు కుదించారు. ఒకవేళ స్కోరు 4-4 వద్ద సమమైతే టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. గతేడాది తొలి చాంపియన్స్ టెన్నిస్ లీగ్ టైటిల్‌ను పుణే మరాఠాస్ జట్టు సొంతం చేసుకోగా... ఢిల్లీ డ్రీమ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.