నోవేలిస్ ఫలితాలతో హిందాల్కో జూమ్
ముంబై: హిందాల్కో ఇండస్ట్రీస్ పై దాని అనుబంధ సంస్థ నోవెలిస్ ఫలితాల ప్రభావం బాగా పడింది. ఏడాది క్యూ2లో హిందాల్కో విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ కౌంటర్ దాదాపు 3 శాతానికిపైగా లాభపడి 23 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. అనుకూలమైన విదేశీ మారక లాభాలు, ప్రధానంగా ఉత్పాదకత లాభాల కారణంగా ఈ ఫలితాలు సాధించామని అల్యూమినియం ఉత్పత్తిలో వరల్డ్ లీడర్ నోవేలిస్ ఇంక్ ఒక ప్రకటనలో తెలిపింది.వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈబీఐటీడీఏ మార్జిన్లు, మెటల్ ఇన్పుట్ ఆప్టిమైజేషన్ తో సానుకూల ఫలితాలు సాధించామని నోవెలిస్ అధ్యక్షుడు ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టీవ్ ఫిషర్ తెలిపారు.
కాగా, ఈ ఏడాది(2016)లో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 5 శాతం బలపడితే ఈ షేరు 102 శాతం దూసుకెళ్లింది. జూలై-సెప్టెంబర్లో నోవెలిస్ నిర్వహణ లాభం 18.2 కోట్ల డాలర్ల నుంచి 25.6 కోట్ల డాలర్లకు ఎగిసింది. ఎబిటా మార్జిన్లు 14శాతం పెరిగి 270మిలియన్లుగా నమోదు చేసింది.కాగా హిందాల్కో బోర్డ్ ఈ శనివారం (నవంబరు12) న సమావేశం కానుంది. అనంతరం హిందాల్కో క్యూ2 ఫలితాలు ప్రకటించనుంది. దీని నికర లాభాలు 4శాతం ఎగిసి రూ.3,100 కోట్లకు చేరనుందని మార్కెట్ వర్గాల అంచనా.