Rocky Star
-
యాక్షన్ స్టార్‌పై రేప్ కేసు..కోర్టు రివ్యూ
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్(71) పై నమోదైన లైంగిక దాడి కేసును జిల్లా లైంగిక నేరాల దర్యాప్తు బృందం తిరగదోడింది. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు కేసును సమీక్షించనుందని కోర్టు ప్రతినిధి బుధవారం ప్రకటించారు. స్టాలోన్ తనపై 1990లో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గత డిసెంబర్లో కేసు పెట్టింది. 27 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి కేసును కోర్టు సమీక్షించనుందన్న వార్తలపై స్టాలోన్ తరపు ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఆయన తరపు న్యాయవాది మార్టిన్ సింగర్ గతంలో మాట్లాడుతూ.. ‘డిసెంబరులో స్టాలోన్‌పై లైంగిక దాడిపై కేసు నమోదైంది. ఫిర్యాదుపై విచారణ చేపట్టామని సాంటా మోనికా పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్టాలోన్ న్యాయ పోరాటం చేస్తార’ని పేర్కొన్నారు. అయితే విచారణలో పురోగతి లేకపోవడంతో కేసు చతికిల పడిందనుకున్న తరుణంలో కేసుపై కోర్టు సమీక్షకు సిద్ధపడడం పట్ల స్టాలోన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 1976లో ‘రాకీ’ చిత్రంతో స్టాలోన్ హాలీవుడ్లో యాక్షన్ సూపర్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే, లైంగిక దాడులపై గళం విప్పుతూ మొదలైన ‘మీ టూ’ ఉద్యమం స్ఫూర్తితో గత 8 నెలలుగా హాలీవుడ్ రంగంలోని మహిళా ప్రముఖులు స్పందిస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులపై కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాత హార్వే విన్స్టన్ లైంగిక దాడిపై ఆరోపణలు ఎదుర్కొంటుండగా, కమెడియన్ బిల్ కాస్బీ 2004లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
కొండల ప్రేమికుడు!
‘‘హోటల్, హాస్టల్లాంటి వేవీ లేని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించడం అంటే నాకు మహా ఇష్టం’’ అని తనను తాను పరిచయం చేసుకుంటాడు రష్యాకు చెందిన ఒలెగ్ గ్రిగోరెవ్. నిజానికతనికి కొండలను చూడడం అంటే, వాటితో మౌనంగా మాట్లాడడం అంటే, వాటి సొగసును తన కెమెరాలో బంధించడం అంటే తెగ ఇష్టం. అతడితో పాటే ఎప్పుడూ ఒక టెంట్ ఉంటుంది. కొండల దగ్గర టెంటు వేసుకొని, వాటిని చూస్తూ గడపడం అంటే గ్రిగోరెవ్కు ఇష్టం. యూరప్, ఆసియాలలో... ఉదయసంధ్యలలో, త్రికాలలలో ఆయన ఎన్నో కొండల ఫోటోలు తీశాడు. ఈ ఫోటోలన్నీ తన టెంట్ నుంచి తీసినవే కావడం గమనార్హం. వృత్తిరీత్యా న్యాయవాది అయిన గ్రిగోరెవ్ కోర్టులో గడిపిన దానికంటే కొండల దగ్గర గడిపిందే ఎక్కువ. తజికిస్థాన్‌లో ఫాన్ కొండలలోని 5489 మీటర్ల ఎత్తు ఉన్న చిమ్టర్గ శిఖారాన్ని అధిరోహించిన తొలి రష్యన్గా పేరు సాధించాడు గ్రిగోరెవ్. ప్రమాదకరమైన శిఖరంగా చెప్పబడే మిరలి శిఖరాన్ని ఎలాంటి ప్రమాదం లేకుండా అధిరోహించి శభాష్ అనిపించుకున్నాడు. చాలామంది గ్రిగోరెవ్ను ‘రాకీ స్టార్’ అని పిలుస్తారు. విశేషం ఏమిటంటే తన ప్రయాణాలలో గ్రిగోరెవ్ తీసిన ఫోటోలు ఎందరికో ప్రేరణగా నిలిచాయి. ఎప్పుడూ ఇల్లు దాటని వారు కూడా ఆ ఫోటోలను చూసిన పిమ్మట భుజానికి బ్యాగు తగిలించుకొని పర్వతాలను వెదుకుతూ వెళ్లారు!