సిల్వస్టర్ స్టాలోన్ (ఫైల్ ఫోటో)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్(71) పై నమోదైన లైంగిక దాడి కేసును జిల్లా లైంగిక నేరాల దర్యాప్తు బృందం తిరగదోడింది. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు కేసును సమీక్షించనుందని కోర్టు ప్రతినిధి బుధవారం ప్రకటించారు. స్టాలోన్ తనపై 1990లో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గత డిసెంబర్‌లో కేసు పెట్టింది. 27 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి కేసును కోర్టు సమీక్షించనుందన్న వార్తలపై స్టాలోన్ తరపు ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఆయన తరపు న్యాయవాది మార్టిన్ సింగర్ గతంలో మాట్లాడుతూ.. ‘డిసెంబరులో స్టాలోన్‌పై లైంగిక దాడిపై కేసు నమోదైంది. ఫిర్యాదుపై విచారణ చేపట్టామని సాంటా మోనికా పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్టాలోన్ న్యాయ పోరాటం చేస్తార’ని పేర్కొన్నారు. అయితే విచారణలో పురోగతి లేకపోవడంతో కేసు చతికిల పడిందనుకున్న తరుణంలో కేసుపై కోర్టు సమీక్షకు సిద్ధపడడం పట్ల స్టాలోన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
1976లో ‘రాకీ’ చిత్రంతో స్టాలోన్ హాలీవుడ్‌లో యాక్షన్ సూపర్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే, లైంగిక దాడులపై గళం విప్పుతూ మొదలైన ‘మీ టూ’ ఉద్యమం స్ఫూర్తితో గత 8 నెలలుగా హాలీవుడ్ రంగంలోని మహిళా ప్రముఖులు స్పందిస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులపై కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాత హార్వే విన్‌స్టన్ లైంగిక దాడిపై ఆరోపణలు ఎదుర్కొంటుండగా, కమెడియన్ బిల్ కాస్బీ 2004లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment