కొండల ప్రేమికుడు!
‘‘హోటల్, హాస్టల్‌లాంటి వేవీ లేని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించడం అంటే నాకు మహా ఇష్టం’’ అని తనను తాను పరిచయం చేసుకుంటాడు రష్యాకు చెందిన ఒలెగ్ గ్రిగోరెవ్. నిజానికతనికి కొండలను చూడడం అంటే, వాటితో మౌనంగా మాట్లాడడం అంటే, వాటి సొగసును తన కెమెరాలో బంధించడం అంటే తెగ ఇష్టం. అతడితో పాటే ఎప్పుడూ ఒక టెంట్ ఉంటుంది.
కొండల దగ్గర టెంటు వేసుకొని, వాటిని చూస్తూ గడపడం అంటే గ్రిగోరెవ్‌కు ఇష్టం. యూరప్, ఆసియాలలో... ఉదయసంధ్యలలో, త్రికాలలలో ఆయన ఎన్నో కొండల ఫోటోలు తీశాడు. ఈ ఫోటోలన్నీ తన టెంట్ నుంచి తీసినవే కావడం గమనార్హం. వృత్తిరీత్యా న్యాయవాది అయిన గ్రిగోరెవ్ కోర్టులో గడిపిన దానికంటే కొండల దగ్గర గడిపిందే ఎక్కువ. తజికిస్థాన్‌లో ఫాన్ కొండలలోని 5489 మీటర్ల ఎత్తు ఉన్న చిమ్టర్గ శిఖారాన్ని అధిరోహించిన తొలి రష్యన్‌గా పేరు సాధించాడు గ్రిగోరెవ్.
ప్రమాదకరమైన శిఖరంగా చెప్పబడే మిరలి శిఖరాన్ని ఎలాంటి ప్రమాదం లేకుండా అధిరోహించి శభాష్ అనిపించుకున్నాడు. చాలామంది గ్రిగోరెవ్‌ను ‘రాకీ స్టార్’ అని పిలుస్తారు. విశేషం ఏమిటంటే తన ప్రయాణాలలో గ్రిగోరెవ్ తీసిన ఫోటోలు ఎందరికో ప్రేరణగా నిలిచాయి. ఎప్పుడూ ఇల్లు దాటని వారు కూడా ఆ ఫోటోలను చూసిన పిమ్మట భుజానికి బ్యాగు తగిలించుకొని పర్వతాలను వెదుకుతూ వెళ్లారు!