రెండు బూత్‌లలో రీ-పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రోహతాస్‌నగర్, ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్‌లలో సోమవారం రీ-పోలింగ్ జరిగింది. శనివారం విధానసభ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున ఈ రెండు పోలింగ్ బూత్‌లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగ్గా పనిచేయలేదని గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ రీ-పోలింగ్ జరిపించాలని నిర్ణయించారు. తూర్పు ఢిల్లీలోని రోహతాస్‌నగర్‌లో ఉన్న 132 నంబరు పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ డేటాను తొలగించలేదని, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని డీఐడీ లైన్స్ ఏరియాలోని 31వ నంబరు పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రంలో సమస్య కారణంగా పరిశీలకుని నివేదిక సరిగ్గా నమోదుకాలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు పోలింగ్ బూత్‌లలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రీ-పోలింగ్ నిర్వహించారు.