సదా మీ సేవలో
24గంటలూ ప్రజలకు అందుబాటులో ..
ఏ సమస్య ఉన్నా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
మహిళా భద్రతపై ప్రత్యేక చర్యలు
వనపర్తిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
సాక్షి, వనపర్తి
వనపర్తి జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉంది. నా మాతృభాష తెలుగు కాకపోయినా.. తెలుగులో మాట్లాడేందుకు ఇష్టంగా భావిస్తున్నాను. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీంలను ఏర్పాటు చేసి, వారికి రక్షణ కలిస్తాం.’అని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లో..
వనపర్తి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వర్గాలు ఇప్పటికైతే లేవు. ఒకవేళ ఏదైన అవాంచనీయ సంఘటనలు జరిగితే.. కిందిస్థాయి సిబ్బందిని అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉంచుతాం. ఫిర్యాదులుంటే నేరుగా 100టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. వనపర్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బందితోనే ప్రత్యేకంగా ట్రాఫిక్ కోసం కేటాయించి, సమస్యను పరిష్కరిస్తాం. సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తాం. కిందిస్థాయిలో న్యాయం జరగకుంటే బాధితులు నేరుగా ఆశ్రయించవచ్చు. ప్రజలకు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నేరునా నాకు ఫిర్యాదు చేయవచ్చు.
మహిళలకు భద్రత పెంచుతాం..
వనపర్తిలో విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు అధికంగా ఉన్నారు. విద్యార్థులు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తాం. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌లకు పాల్పడకుండా చూస్తాం. మహిళలను వేధించినా.. గృహహింస, వరకట్న వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందితే కఠినచర్యలు తీసుకుంటాం. షీ టీంలను పెంచి మహిళలకు, యువతులకు భద్రతను పెంచుతాం. మద్యం దుకాణాలు రాత్రి పది గంటలకు యధావిధిగా మూసివేయాలి. ఇతర దుకాణాల సమయం గురించి రెండు మూడు రోజుల్లో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం.