rohith sucide
-
హిందూ రాష్ట్ర అభివృద్ధి శాఖగా మార్చనీయకండి
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీతారాం ఏచూరి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖను హిందూ రాష్ట్ర డెవలప్మెంట్ మినిస్ట్రీగా మార్చకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలసి ఒక వినతిపత్రం సమర్పించింది. ‘సెంట్రల్ వర్శిటీకి మీరు విజిటర్‌గా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వీసీ నియామకంపై వివాదం నడుస్తోంది. రోహిత్ ఆత్మహత్య తర్వాత దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఈ నెల 22న మళ్లీ వర్శిటీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోగానే విద్యార్థులపై లాఠీ దాడి మీకు తెలిసే ఉంటుంది. ఈ వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వసతి గృహాలకు నల్లా కనెక్షన్లను తొలగించారు. హాస్టల్ మెస్‌కు ఆహార సరఫరా నిలిపివేశారు. పోలీసు చర్యపై ఈ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదిగా పేర్కొంది. హెచ్చార్డీ మీవైపు మాకు దారి చూపించింది. అందువల్ల మీరు తక్షణం జోక్యం చేసుకుని సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడగలరు’ అని కోరారు. -
హెచ్సీయూకు నేడు మల్లికార్జున ఖర్గే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హెచ్సీయూకు రానున్నారు. రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఖర్గే వస్తున్నట్టుగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత బెంగ ళూరు వెళ్తారని వివరించారు. -
పరిస్థితి చక్కదిద్దాలని మాత్రమే కోరా
- హెచ్‌సీయూ పాలన అంశాల్లో జోక్యం చేసుకోలేదు: దత్తాత్రేయ - ఏబీవీపీ ప్రతినిధుల వినతి పత్రాలను నా కవరింగ్ లెటర్‌తో హెచ్ఆర్డీకి పంపా.. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరం సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. ఏబీవీపీ ప్రతినిధులు అందించిన వినతి పత్రాలను తన కవరింగ్ లెటర్‌తో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి పంపించానని వివరణ ఇచ్చారు. యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దాలని మాత్రమే మంత్రిని కోరానని, రోహిత్ ఆత్మహత్యకు తాను కారణం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏబీవీపీ విద్యార్థులు ఆగస్టు 10న, ఆగస్టు 29న తనకు వేర్వేరుగా రెండు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రెండింటినీ మంత్రికి పంపించినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీలోని విషయాలపై దృష్టి కేంద్రీకరించి, క్యాంపస్‌లో పరిస్థితులను చక్కదిద్దాలని కోరినట్టుగా వివరించారు. కేంద్రీయ యూనివర్సిటీ స్వతంత్ర సంస్థ అని, వర్సిటీ పరిపాలనా అంశాలు, నిర్ణయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. ఏబీవీపీ ప్రతినిధుల నుంచి వచ్చిన లేఖలను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి పంపడం వరకే తన పాత్ర పరిమితమైందన్నారు. తన దగ్గరకు ఏ విద్యార్థి సంఘం వచ్చినా సరే.. వారిచ్చే వినతి పత్రాలను సంబంధిత శాఖలకు పంపించే వాడినని తెలిపారు. అంతకు మించి ఈ కేసులో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు ప్రతిరోజూ వందలాది మంది వస్తుంటారని, వారి విషయంలో స్పందించినట్టుగానే ఏబీవీపీ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాలపై కూడా స్పందించినట్టు వివరించారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఇది తన బాధ్యత అని దత్తాత్రేయ చెప్పారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు.