
పరిస్థితి చక్కదిద్దాలని మాత్రమే కోరా
- హెచ్‌సీయూ పాలన అంశాల్లో జోక్యం చేసుకోలేదు: దత్తాత్రేయ
- ఏబీవీపీ ప్రతినిధుల వినతి పత్రాలను నా కవరింగ్ లెటర్‌తో హెచ్‌ఆర్‌డీకి పంపా.. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరం
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. ఏబీవీపీ ప్రతినిధులు అందించిన వినతి పత్రాలను తన కవరింగ్ లెటర్‌తో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి పంపించానని వివరణ ఇచ్చారు. యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దాలని మాత్రమే మంత్రిని కోరానని, రోహిత్ ఆత్మహత్యకు తాను కారణం కాదని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏబీవీపీ విద్యార్థులు ఆగస్టు 10న, ఆగస్టు 29న తనకు వేర్వేరుగా రెండు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రెండింటినీ మంత్రికి పంపించినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీలోని విషయాలపై దృష్టి కేంద్రీకరించి, క్యాంపస్‌లో పరిస్థితులను చక్కదిద్దాలని కోరినట్టుగా వివరించారు. కేంద్రీయ యూనివర్సిటీ స్వతంత్ర సంస్థ అని, వర్సిటీ పరిపాలనా అంశాలు, నిర్ణయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు.
ఏబీవీపీ ప్రతినిధుల నుంచి వచ్చిన లేఖలను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి పంపడం వరకే తన పాత్ర పరిమితమైందన్నారు. తన దగ్గరకు ఏ విద్యార్థి సంఘం వచ్చినా సరే.. వారిచ్చే వినతి పత్రాలను సంబంధిత శాఖలకు పంపించే వాడినని తెలిపారు. అంతకు మించి ఈ కేసులో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు ప్రతిరోజూ వందలాది మంది వస్తుంటారని, వారి విషయంలో స్పందించినట్టుగానే ఏబీవీపీ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాలపై కూడా స్పందించినట్టు వివరించారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఇది తన బాధ్యత అని దత్తాత్రేయ చెప్పారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు.