వృత్తి విద్యావ్యాపారానికి అడ్డుకట్ట
రాష్ట్రంలో 1995లో చంద్రబాబు అధికారంలోకొచ్చిన నాటి నుండి విద్య ప్రైవేటీకరణ అడ్డూ అదుపులేకుండా సాగింది. ఎలాంటి ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా అనుమతులనిచ్చి, రాష్ట్రంలో విద్యా వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వికసింపజేశాయి. రాష్ట్రంలో వృత్తి విద్యాసంస్థల నిర్వహణ ఫక్తు వ్యాపారంగా మారింది. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, నియమనిబంధనలను, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా రూపొందించి అమలు చేసిన నాడే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందగలదు.
విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదునెలలు గడిచినా, తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క కోర్సుకి సజావుగా అడ్మిషన్లు పూర్తిచేసిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి, రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ విద్యార్థుల స్థానికత, ఫీజు రీయింబర్స్మెంట్, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లాంటి కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకోవడంలో అవి తీవ్రనిర్లక్ష్యం వహించాయి. ఈ స్థితిలో లక్షలాది విద్యార్థుల విద్యాభవిష్యత్కు బాటలు వేయా ల్సిన అడ్మిషన్ల ప్రక్రియ అయోమయంగా మారింది. ప్రతి ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేసే ఉన్నత విద్యామండలి, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భిన్నధ్రువాలను అనుసరిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తెలం గాణ ప్రభుత్వం అక్టోబర్ వరకు అడ్మిషన్లు జరుపుకునేందుకు గడువు ఇవ్వమని కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించి ఆగస్టు 31 లోపు పూర్తిచేయాలని ఆదేశించింది. గతంలో మాదిరి ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అడ్మిషన్లు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపున కౌన్సెలింగ్ జరిగినప్పటికీ, అడ్మిషన్లు జరగక హైకోర్టును ఆశ్రయించిన ఇంజనీరింగ్, పీజీ అడ్మిషన్లు, ఇంకా కౌన్సెలింగ్ ఊసే లేని డీఎడ్ అడ్మిషన్లు, వెరసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పాత్ర
అవిభక్త రాష్ట్రంలో 1995 నుండి అన్ని వృత్తి విద్యాకోర్సుల ప్రవేశపరీక్షలు, అడ్మి షన్లను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించేవారు. రాష్ట్రంలో 1995 లో 35 ఇంజనీరింగ్ కళాశాలలుండగా, 2000 సంవత్సరానికి నూటికి, 2012 నాటికి 750కి ఆ సంఖ్య చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి ఉన్న డిమాం డ్‌ను అందిపుచ్చుకున్న నాటి ఏపీ ప్రభుత్వం ప్రైవేటు విద్యను బాగా ప్రోత్స హించగా, జేఎన్టీయూ, ఏఐసీటీయూ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్)లు ప్రైవేటు యాజమాన్యాలకు వెన్నుదన్నుగా నిలిచి, అడిగిందే తడవుగా కాలేజీలకు అనుమతులనిచ్చారు. ఇష్టం వచ్చినప్పుడల్లా కాలేజీలకు అనుమతులను మంజూరుచేస్తూండటంతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, పీసెట్, పాలిసెట్‌ల అడ్మిషన్లు ప్రతి ఏడాది అనేకసార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ నవంబర్‌లో క్లాసులు ప్రారంభిస్తున్నారు. అడ్మిషన్లలో జాప్యం సుప్రీంకోర్టుకు చేరటంతో ఇకపై ప్రతి ఏడాది జూలై 31 లోపే ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 1956 స్థానికత తదితర అంశాల కారణంగా ఏపీ ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల ప్రక్రియ ముందుకుసాగించ లేని స్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొత్త విధా నాన్ని తెలిపే జీవోను విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆ స్థితిలో సుప్రీంకోర్టు ఆదేశిం చినట్లు ఆగస్టు 31లోపు ఏపీ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ జరిపేందుకు ప్రయత్నించింది, దాన్ని సవాల్‌చేస్తూ అక్టోబర్ వరకు కౌన్సెలింగ్‌కు అనుమతిని మ్మని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించి, ఆగస్టు 31లోపు పూర్తిచేయాలని ఆదేశించగా, ఉన్నత విద్యామం డలి 174 కాలేజీలు మినహా మిగిలిన వాటికి నిర్వహించి, అడ్మిషన్లు పూర్తి చేసింది. అలానే స్థానికత విషయంలోను 371(డి) ప్రకారం ఇప్పటివరకు అమలు జరుగుచున్న విధానాన్నే అమలు చేయమని సుప్రీం సూచించింది.
ఏఐసీటీఈ నిర్వాకం
దేశంలో సాంకేతిక విద్యను పటిష్టపరిచేందుకు ప్రారంభించిన రాజ్యాంగసంస్థ ఇది. దాని స్థాపన లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇది విచ్చలవిడిగా ఇంజ నీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, కాలేజీలకు అనుమతులనిచ్చింది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభంకావాలి. కానీ ఏఐసీటీఈ, నియమ నిబంధనలను తుంగలోతొక్కి జూన్- సెప్టెంబర్ నెలల మధ్య అనేక విడతలుగా కొత్త కళాశాలలకు, అదనపు సెక్షన్లకు అనుమతినిస్తూవచ్చింది. ఈ స్థితిలో అడ్మి షన్లు సజావుగా, సకాలంలో జరపటం సాధ్యంకాక ప్రతీ ఏడాది నవంబర్‌లో క్లాసులు ప్రారంభించటం ఆనవాయితీగా మారింది. పైగా కళాశాల యాజమా న్యాల వ్యాపార దృష్టి, ఏఐసీటీఈ అవినీతి బాగోతాలు, రాజకీయ నాయకులే కళాశాలలను స్థాపించటం వెరసి, యాజమాన్యాలకు కనుక వర్షం కురిపించి ఉండవచ్చు. కాని లక్షలాది విద్యార్థుల భవిష్యత్‌ను ఛ్రిదం చే శాయి.
జేఎన్టీయూ పాత్ర
ప్రతి ఏడాది ఏఐసీటీఈ అనుమతినిచ్చిన ప్రతి కాలేజీకి, ఇప్పటివరకు జేఎన్టీ యూహెచ్ అనుబంధ గుర్తింపును ఇస్తూవచ్చింది. ఇదంతా ఇప్పుడు గత చర్రిత. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జేఎన్టీయూహెచ్ తొలిసారిగా 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపును నిరాకరించింది. దీనితో వాటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వం జేఎన్టీయూహెచ్ చర్యపై నోరుమె దపలేదు. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పుడు నవంబర్ 5 నుండి 15 వరకు వాటికి కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. అలాగే పీజీ ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయం లోను 272 కాలేజీల తనిఖీలను జేఎన్టీయూహెచ్ నేటికీ పూర్తిచేయకపోవడం వలన రెండునెలల క్రితం కౌన్సెలింగ్ పూర్తయినా, వీటిలో సీట్ల కేటాయింపు జరగక, హైకోర్టులో కేసు నడుస్తూంది. ప్రతి ఏటా ఎంసెట్‌ను నిర్వహిస్తూ కేవ లం సాంకేతిక విద్యకొరకే స్థాపించిన జేఎన్టీయూహెచ్ వైఖరి కారణంగా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్, పీజీ ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి కావడంలేదు.
సుప్రీంకోర్టు పాత్ర
రాష్ట్ర విభజనతో విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నమాట వాస్తవం. అందుకే జూలై చివరివరకు ఉన్న ఇంజనీరింగ్ అడ్మిషన్ల గడువును ఉన్నత విద్యామండలి విన్నపం మేరకు సుప్రీంకోర్టు ఆగస్టు 31కి పొడిగించిం ది. ఆపై తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ చివరివరకు గడువు అడగగా, కుద రదని, ఆగస్టు చివరికల్లా అడ్మిషన్లు పూర్తిచేయాలని ఆదేశించింది. జేఎన్టీయూ హెచ్చే అనుబంధ గుర్తింపు రద్దయిన 174 కళాశాలలు కూడా కోర్టుకు పోవడంతో వాటికి నవంబర్ 14 వరకు అడ్మిషన్లు జరిపేందుకు అనుమతిస్తూ ఒకసారి కళాశాలలే స్వయంగా అడ్మిషన్లు జరుపుకోమని, మరోసారి ఉన్నత విద్యామండలి మాత్రమే అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయాలను మార్చింది. ఇప్పుడిచ్చిన అనుమతినే సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం అడిగినప్పుడే ఇచ్చి ఉంటే ఏనాడో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి క్లాసులు జరుగుచుండేవి.
కింకర్తవ్యం
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా, కనీసం మూడేళ్లు అడ్మిషన్లను, ప్రవేశ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించడమే ఉత్తమం. ప్రతి ఏటా మే నెలలో అన్ని సెట్లను నిర్వహించి 15 రోజులలో ఫలితాలు ప్రకటిస్తున్న అధికారులు, అడ్మిషన్లను నవంబర్ వరకు కాకుండా జూలై చివరికల్లా అన్ని కోర్సుల అడ్మి షన్లు పూర్తి చేసేందుకు చర్యలు చేపడితే మంచిది. ప్రతి ఏటా అన్ని రకాల కళాశాలల తనిఖీలను ఏప్రిల్‌లోపు తనిఖీలు నిర్వహించి అర్హమైన కళాశాలల జాబితాను ఉన్నత విద్యామండలికి అందించడం అవసరం. అన్నిటికంటే మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, విద్యా వ్యాపారుల కొమ్ముకాసే విధానా లకు స్వస్తిచెప్పడమేకాక, బినామీల పేరుతో ప్రజాప్రతినిధులు నడుపుతున్న విద్యాసంస్థలను నిషేధించితీరాలి. రాష్ట్రప్రభుత్వాలు, జేఎన్టీయూహెచ్ విధా నాల కారణంగా వేలాదిమంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వలసపోవటాన్ని ఆపాలంటే సత్వరం విద్యార్థి ప్రయోజనాలకు అద్దంపట్టే నిర్ణయాలను ప్రకటించి అమలుచేయకతప్పదు. ఇప్పటివరకు అడ్మిషన్ల వివాదాల్లో అగ్రగామిగా ఉన్న తెలుగు రాష్ట్రాలు సరైన నిర్ణయాల ద్వారా ప్రమాణాలు పెంచినప్పుడే రాష్ట్ర విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. రాష్ట్రంలో వృత్తివిద్యాసంస్థల నిర్వ హణ ఫక్తు వ్యాపారంగా మారింది. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, నియమ నిబంధనలను, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా రూపొందించి అమలు చేసిన నాడే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందగలదు.
(వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యకర్త) ఎం. రోజాలక్ష్మి