మేయర్ ఎన్నికల్లో గందరగోళం ‘ఏడాది’పై వివాదం
న్యూఢిల్లీ:ఢిల్లీ పురపాలక సంఘ అధీనంలోని మూడు కార్పొరేషన్లకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయీ సంఘం సభ్యులను ఏటా మార్చే అంశంపై నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకొని, సమర్థపాలన అందించడం సాధ్యపడదని వీళ్లు వాదిస్తున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఈ నెలాఖరున ఎన్నుకుంటారు. ప్రస్తుతం మేయర్ల ఏడాది పదవీకాలం పూర్తి కావడంతో వీళ్లు వైదొలుగుతున్నారు. నిబంధనల ప్రకారం మేయర్ పదవీ కాలం ఐదేళ్లు.
అయితే ఏటా ఒక్కొక్కరు (రొటేషన్ విధానం) వైదొలుగుతుంటారు. తొలి ఏడాది మహిళకు, మలి ఏడాది సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి), మూడో ఏడాది రిజర్వుడు కేటగిరికి, నాలుగు, ఐదు సంవత్సరాల్లో మళ్లీ సాధారణ విభాగానికి మేయర్ పదవిని కేటాయిస్తామని ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ప్రజాసంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ అన్నారు. ఇది మూడో ఏడాది కాబట్టి ఎస్సీలకు మేయర్ పదవిని కేటాయించాల్సి ఉంటుంది. ఎన్డీఎంసీలో ఈ నెల 28న, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ), దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ)లో 29న మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు.
పెంచకుంటే నష్టమేనంటున్న నాయకులు
ఈడీఎమ్సీ మేయర్ రామ్ నారాయణ్ దూబే మాట్లాడుతూ మేయర్ల పదవీకాలాన్ని ఏడాది కాకుండా కనీసం 25 నెలల వరకైనా పొడిగించాలని కోరారు. భారీ మున్సిపల్ ప్రాంతంలోని పాలనను అర్థం చేసుకొని, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఏడాదిలో సాధ్యపడబోదని ఆయన స్పష్టం చేశారు. మేయర్ పదవీకాలం కనీసం 2.5 ఏళ్లు అయినా ఉండాలని ఎన్డీఎమ్సీ మేయర్ ఆజాద్సింగ్ అన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి 12 నెలల సమయం ఎంత మాత్రమూ సరిపోదని ఆయన వాదించారు. ‘ఉత్తరఢిల్లీలో నీరు, డ్రైనేజీలు, డెంగీ వంటి సమస్యలు ఎక్కువ.
సంవత్సరానికి ఒక మేయర్ మారుతూ ఉంటే పాలనావ్యవస్థ మారుతూ ఉంటుంది. కొత్త మేయర్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి. దీనివల్ల పనులన్నీ ఆలస్యమవుతాయి’ అని సింగ్ అభిప్రాయపడ్డారు. దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్ పదవి, ఇతర ముఖ్య పదవులకు ఇంకా ఎవరూ నామినేషన్ పత్రాలు సమర్పించలేదు. అయితే నామినేషన్లకు తుది గడువు సోమవారంతో ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. పదవీకాలం వివాదంపై ఎస్డీఎమ్సీ విపక్ష నాయకుడు ఫర్హాద్ సూరి మాట్లాడుతూ ‘రొటేషన్ పద్ధతిలో ఏడాదికి ఒకరిని మేయర్ పదవికి ఎన్నుకునే పద్ధతిని రద్దు చేయాలి. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకసారి మహిళలకు, రెండోసారి (ఐదేళ్లపాటు) ఎస్సీ, మూడోసారి సాధారణ విభాగం.. ఇలా ఎన్నికలు నిర్వహించాలి. దీనివల్ల అన్ని కార్పొరేషన్లలోనూ సమర్థ పాలన సాధ్యపడుతుంది’ అని ఆయన సూచించారు.
ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటే..
సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఢిల్లీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలకు మేయర్ల ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు కాబట్టి ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొందరు ఎంపీలు రెండు కార్పొరేషన్లలోనూ ఓటు వేయవచ్చు. ఉదాహరణకు ఒక ఎంపీ నియోజకవర్గ ప్రాంతం ఎన్డీఎమ్సీ, ఎస్డీఎమ్సీలోనూ ఉంటే రెండు కార్పొరేషన్లలోనూ ఆయన ఓటు వేయవచ్చు. ఎన్డీఎమ్సీలో మొత్తం 104 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా పోటీకి దిగారు. ఈడీఎమ్సీలో 64 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు రాజీనామా చేశారు. ఎస్డీఎమ్సీలోనూ 104 మంది సభ్యులు ఉండగా ముగ్గురు వైదొలిగారు. మేయర్లతోపాటే డిప్యూటీ మేయర్లు, స్థాయీసంఘం సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే స్థాయీసంఘం సభ్యులను మాత్రం మేలో ఎన్నుకుంటారు.