Royal Albert Hall
-
బాహుబలికి ముందు ఆ సినిమానే!
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
భళా బాహుబలి
‘బాహుబలి’ చిత్రం భారతీయ సినిమాలో పెను మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్‌ని విస్తృత పరిచింది.. హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ప్రపంచ వ్యాప్త సినీ ప్రేక్షకులందరితో ‘భళా బాహుబలి’ అనిపించుకుంది. ఇప్పుడు లండన్‌లోనూ ‘భళా బాహుబలి’ అంటూ వినిపిస్తోంది. లండన్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: 1’ చిత్రాన్ని హిందీలో ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారని సమాచారం. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. -
పంచెకట్టులో రాజమౌళి.. ఎందుకోసమంటే..
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు తెలిసేలా చేసిన చిత్రం బాహుబలి. తాజాగా బాహుబలి టీమ్ సభ్యులు మళ్లీ కలిశారు. లండన్‌లో రాయల్ రీ యూనియన్ జరుపుకున్నారు. వీరు ఎందుకోసం కలిశారంటే.. లండన్‌లోని అల్బర్ట్ హాల్లో శనివారం ‘బాహుబలి1’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి టీమ్ అక్కడికి వెళ్లింది. లండన్ వెళ్లిన వారిలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, శోభు యార్లగడ్డ ఉన్నారు. అక్కడ జరిగిన బాహుబలి ప్రదర్శనకు రాజమౌళి పంచెకట్టులో హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా హౌస్‌లోని ప్రేక్షకులు బాహుబలి యూనిట్‌ను చప్పట్లు, కేరింతలతో అభినందించారు. రాయల్ అల్బర్ట్ హాల్లో బాహుబలి ప్రదర్శనను చూడటానికి వచ్చిన పలువురు జపాన్ అభిమానులు వచ్చారు. బాహుబలి యూనిట్ స్టే చేసిన హోటల్ వెలుపల వారిని కలుసుకున్నారు. అలాగే వారితో ఫొటోలు కూడా దిగారు. అయితే రాయల్ అల్బర్ట్ హాల్లో తొలి నాన్-ఇంగ్లిష్ చిత్రం బాహుబలి అని ఆ చిత్ర బృందం తెలిపింది. ఇది మనందరికి గర్వకారణమని పేర్కొంది. -
ఇట్స్ షో టైమ్
డైరెక్టర్ రాజమౌళి, హీరో హీరోయిన్లు ప్రభాస్, రానా, అనుష్క మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ ‘బాహుబలి’ టీమ్ రీ యూనియన్ ‘బాహుబలి –3’ కోసమా? అని మాత్రం అడక్కండి. ఈ విషయానికి రాజమౌళీయే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాత్రం వీరందరూ ఒకే వేదికను పంచుకోబోతున్నది లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబోయే ‘బాహుబలి: ది బిగినింగ్’ షో కోసం. ‘‘ఈ ఏడాది అక్టోబర్ 19న సాయంత్రం ఏడు గంటలకు ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించబడుతుంది. సినిమాలో నటించిన ప్రభాస్, అనుష్క, రానా వస్తారు. షో తర్వాత రాజమౌళితో ప్రశ్నోత్త్తరాల సమయం ఉంటుంది’’ అని ఈ విషయాన్ని రాయల్ ఆల్బర్ట్ హల్ ప్రతినిధులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ‘బాహుబలి’ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. రాయల్ ఆల్బర్ట్ హాల్ విషయానికి వస్తే....1871లో క్వీన్ విక్టోరియా ఈ హాల్‌ను స్టార్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ముఖ్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదికనే ఎక్కువగా ఉపయోగిస్తారట. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ హాల్ సీటింగ్ సామర్థ్యం ఎంతో తెలుసా.... 5,267. -
ఆ థియేటర్లో మైకు లేదు... లైటు లేదు
నైపుణ్యం సిమ్లా... చలి, మంచు... అంతలోనే లేలేత ఎండ... దోబూచులాడే చిరుజల్లుల్ని ఆస్వాదిస్తూ అలా మాల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాల దుకాణాలు, రెస్టారెంట్లు... కొండ ఎక్కడానికి, దిగడానికి ఉన్న లిఫ్ట్ దాటాక ఎడమవైపు కనిపిస్తుంది ఠీవిగా వందేళ్ల గైతీ థియేటర్! గత వైభవ దీప్తికి నిలువెత్తు నిదర్శనంలా! విక్టోరియన్ గోతిక్ వాస్తు శైలిలో నిర్మించారు దీనిని. ఇది లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌కి నకలు. యురోపియన్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందీ ఈ పురాతన రంగస్థలం. భారత్‌కు వచ్చిన యురోపియన్లు ఈ థియేటర్‌ను చూడకుండా వెళ్లరు. ఆ ఆకర్షణకు కారణం... ప్రత్యేకమైన గోతిక్ వాస్తుశైలి ఒకటైతే... శతాబ్ద కాలం కళా సాంస్కతిక నిలయంగా నిలవడం మరో కారణం! బాల్కనీ, జనరల్, రాయల్ క్లాస్‌లతో 365 సీట్లతో రంగస్థల కళలకు కేంద్రం ఈ థియేటర్. దీని మరో ప్రత్యేత... పర్యావరణ సానుకూలత. విద్యుత్ సౌకర్యం లేని కాలంలో దీని నిర్మాణం జరిగింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేదికపై సహజసిద్ధమైన కాంతి ప్రసరించేలా నిర్మించారు. అయితే, ఇప్పుడు అదనపు లైటింగ్ కోసం షాండ్లియర్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ థియేటర్లో మైక్స్ ఉపయోగించరు అనేకంటే అసరమేలేదు అనడమే సబబు. ఎందుకంటే ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పారిస్ కాగితపు గుజ్జుతో థియేటర్ లోపలి గోడలకు పూత పూశారు. అది శబ్దాన్ని గ్రహించి విడుదల చేస్తుంది. అంటే మైక్‌లా పనిచేస్తుందన్నమాట. ఆ ఆడిటోరియంలో ఏ స్థాయి శబ్దం అవసరమో అంత స్థాయిలోనే వినిపిస్తుంది. చెవులు చిల్లులు పడే శబ్దాలుండవు. ఇప్పటికీ సహజసిద్ధమైన లైటింగ్ అండ్ మైక్ సిస్టమ్‌తోనే నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఇదీ చరిత్ర... బ్రిటిష్ హయాంలో అప్పట్లో సిమ్లా సూపరింటెండెంట్‌గా పనిచేసిన లార్డ్ హెన్రీ ఇర్విన్ 1889లో ఈ థియేటర్‌కు రూపకల్పన చేశారు. తొలుత ఇది ఐదంతస్తుల భవనం. బాల్రూమ్, ఆయుధాగారం, పోలీసు కార్యాలయం, బార్, ఆర్ట్ గ్యాలరీ వంటివన్నీ ఉండేవి. నిత్యం ఏదో ఒక వేడుకతో కళకళలాడే ఈ థియేటర్ అప్పట్లో సిమ్లాలో ఉండే బ్రిటిష్ వారికి ఆటవిడుపు కేంద్రం. గట్టి పునాదులపై దీనిని నిర్మించలేదనే కారణంగా ఇరవయ్యేళ్ల తర్వాత కొన్ని అంతస్తులను కూల్చేశారు. పునరుద్ధరణ పనుల కోసం 2005 నుంచి 2009 వరకు దీనిని మూసివేశారు. 2009లో ఇది పునఃప్రారంభమైంది. పుణ్యక్షేత్రం రుడ్యార్డ్ క్లిప్పింగ్, బాతెన్ పాల్, కె.ఎల్.సైగల్, పృథ్వీరాజ్ కపూర్, జెన్నిఫర్ కపూర్, బల్రాజ్ సహానీ, ప్రాణ్, మనోహర్ సింగ్, శశికపూర్, రాజ్ బబ్బర్, నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ వంటి నటదిగ్గజాలు ఈ వేదికపై నటనా కౌశలం చాటుకున్నవారే. 1960, 70ల్లోని బాలీవుడ్ చిత్రాలే కాకుండా, ఇటీవలి గదర్ ఏక్ ప్రేమ్ కథా, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాలూ ఈ థియేటర్లో షూటింగ్ జరుపుకొన్నాయి. అయితే షూటింగ్‌ల వల్ల థియేటర్ కాస్త దెబ్బతినడంతో సినిమా షూటింగ్‌లను నిషేధించారు. అటు నాటకరంగంలోని దిగ్గజాల నుంచి ఔత్సాహిక కళాకారులు, ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి విదేశీ పర్యాటకుల వరకు అందరికీ అభిమాన సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈ గైతీ థియేటర్ నిజంగా మన దేశ చారిత్రక, కళాత్మాక సంపదే! - సరస్వతి రమ