ఆ థియేటర్‌లో మైకు లేదు... లైటు లేదు | Successful year for the Villa Marina and Gaiety Theatre | Sakshi
Sakshi News home page

ఆ థియేటర్‌లో మైకు లేదు... లైటు లేదు

Published Sun, May 3 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

ఆ థియేటర్‌లో మైకు లేదు... లైటు లేదు

ఆ థియేటర్‌లో మైకు లేదు... లైటు లేదు

నైపుణ్యం
సిమ్లా... చలి, మంచు... అంతలోనే లేలేత ఎండ... దోబూచులాడే  చిరుజల్లుల్ని ఆస్వాదిస్తూ అలా మాల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాల దుకాణాలు, రెస్టారెంట్లు... కొండ ఎక్కడానికి, దిగడానికి ఉన్న లిఫ్ట్ దాటాక ఎడమవైపు కనిపిస్తుంది ఠీవిగా వందేళ్ల గైతీ థియేటర్! గత వైభవ దీప్తికి నిలువెత్తు నిదర్శనంలా! విక్టోరియన్ గోతిక్ వాస్తు శైలిలో నిర్మించారు దీనిని. ఇది లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌కి నకలు. యురోపియన్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందీ ఈ పురాతన రంగస్థలం. భారత్‌కు వచ్చిన యురోపియన్‌లు ఈ థియేటర్‌ను చూడకుండా వెళ్లరు.
 
ఆ ఆకర్షణకు కారణం...
ప్రత్యేకమైన గోతిక్ వాస్తుశైలి ఒకటైతే...  శతాబ్ద కాలం కళా సాంస్కతిక నిలయంగా నిలవడం మరో కారణం! బాల్కనీ, జనరల్, రాయల్ క్లాస్‌లతో 365 సీట్లతో రంగస్థల కళలకు కేంద్రం ఈ థియేటర్. దీని మరో ప్రత్యేత... పర్యావరణ సానుకూలత. విద్యుత్ సౌకర్యం లేని కాలంలో దీని నిర్మాణం జరిగింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేదికపై సహజసిద్ధమైన కాంతి ప్రసరించేలా నిర్మించారు. అయితే, ఇప్పుడు అదనపు లైటింగ్ కోసం షాండ్లియర్స్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ థియేటర్‌లో మైక్స్ ఉపయోగించరు అనేకంటే అసరమేలేదు అనడమే సబబు. ఎందుకంటే ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పారిస్ కాగితపు గుజ్జుతో థియేటర్ లోపలి గోడలకు పూత పూశారు. అది శబ్దాన్ని గ్రహించి విడుదల చేస్తుంది. అంటే మైక్‌లా పనిచేస్తుందన్నమాట. ఆ ఆడిటోరియంలో ఏ స్థాయి శబ్దం అవసరమో అంత స్థాయిలోనే వినిపిస్తుంది. చెవులు చిల్లులు పడే శబ్దాలుండవు. ఇప్పటికీ సహజసిద్ధమైన లైటింగ్ అండ్ మైక్ సిస్టమ్‌తోనే నాటకాలు ప్రదర్శిస్తున్నారు.
 
ఇదీ చరిత్ర...
బ్రిటిష్ హయాంలో అప్పట్లో సిమ్లా సూపరింటెండెంట్‌గా పనిచేసిన లార్డ్ హెన్రీ ఇర్విన్ 1889లో ఈ థియేటర్‌కు రూపకల్పన చేశారు. తొలుత ఇది ఐదంతస్తుల భవనం. బాల్‌రూమ్, ఆయుధాగారం, పోలీసు కార్యాలయం, బార్, ఆర్ట్ గ్యాలరీ వంటివన్నీ ఉండేవి. నిత్యం ఏదో ఒక వేడుకతో కళకళలాడే ఈ థియేటర్ అప్పట్లో సిమ్లాలో ఉండే బ్రిటిష్ వారికి ఆటవిడుపు కేంద్రం. గట్టి పునాదులపై దీనిని నిర్మించలేదనే కారణంగా ఇరవయ్యేళ్ల తర్వాత కొన్ని అంతస్తులను కూల్చేశారు. పునరుద్ధరణ పనుల కోసం 2005 నుంచి 2009 వరకు దీనిని మూసివేశారు. 2009లో ఇది పునఃప్రారంభమైంది.
 
పుణ్యక్షేత్రం
రుడ్‌యార్డ్ క్లిప్పింగ్, బాతెన్ పాల్, కె.ఎల్.సైగల్, పృథ్వీరాజ్ కపూర్, జెన్నిఫర్ కపూర్, బల్‌రాజ్ సహానీ, ప్రాణ్, మనోహర్ సింగ్, శశికపూర్, రాజ్ బబ్బర్, నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ వంటి నటదిగ్గజాలు ఈ వేదికపై నటనా కౌశలం చాటుకున్నవారే. 1960, 70ల్లోని బాలీవుడ్ చిత్రాలే కాకుండా, ఇటీవలి గదర్  ఏక్ ప్రేమ్ కథా, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాలూ ఈ థియేటర్‌లో షూటింగ్ జరుపుకొన్నాయి. అయితే షూటింగ్‌ల వల్ల థియేటర్ కాస్త దెబ్బతినడంతో సినిమా షూటింగ్‌లను నిషేధించారు. అటు నాటకరంగంలోని దిగ్గజాల నుంచి ఔత్సాహిక కళాకారులు, ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి విదేశీ పర్యాటకుల వరకు అందరికీ అభిమాన సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈ గైతీ థియేటర్ నిజంగా మన దేశ చారిత్రక, కళాత్మాక సంపదే!  
 - సరస్వతి రమ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement