ఈ నాణేనికి నకిలీ కష్టమే!
• అత్యంత సురక్షితమైన కాయిన్‌గా కొత్త ‘12–సైడెడ్ 1 పౌండ్’
• ఈ ఏడాది మార్చి 28 నుంచి యూకేలో చలామణిలోకి
లండన్: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నాణెంగా కొత్త ‘12–సైడెడ్ 1 పౌండ్’ను చెప్పుకోవచ్చని రాయల్ మింట్ పేర్కొంది. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయని, దీన్ని దొంగతనంగా ముద్రిం చడం సాధ్యంకాదని తెలిపింది. కాగా ఈ నాణెం ఈ ఏడాది మార్చి 28 నుంచి యూకేలో చలామణిలోకి రానుంది. ‘కొత్త 12–సైడెడ్ 1 పౌండ్’ ప్రత్యేకమైన ఆకారంతో, చాలా పలుచగా, తక్కువ బరువుతో ఉండి.. ప్రస్తుతమున్న 1 పౌండ్ రౌండ్ కాయిన్‌కు కాస్త పెద్దదిగా ఉంటుందని రాయల్ మింట్ పేర్కొంది.
గత 30 ఏళ్లలో తొలిసారిగా 1 పౌండ్ రౌండ్ కాయిన్‌కు బదులుగా ‘కొత్త 12–సైడెడ్ 1 పౌండ్’ను వ్యవస్థలోకి తీసుకువస్తున్నామని తెలిపింది. నకిలీ నాణెల ముద్రణను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న •ప్రతి ముప్పై 1 పౌండ్ రౌండ్ నాణేల్లో ఒకటి నకిలీదని తెలిపింది. నాణెనికి ఒకవైపు ఇంగ్లిష్ రోజ్, కిరీటం వంటి పలు గుర్తులుంటాయని పేర్కొంది. దీన్ని డేవిడ్ పియర్సె డిజైన్ చేశారని, ఇతని వయసు కేవలం 15 ఏళ్లని తెలిపింది. ఇక నాణేనికి మరోవైపు క్వీన్ ప్రతిమ ఉంటుందని, రాయల్ మింట్ కాయిన్ డిజైనర్ జాడి క్లార్క్ డిజైన్ చేశారని పేర్కొంది.
ఈ నాణెలను ఎందుకు దొంగతనంగా ముద్రించలేమంటే?
⇔ ప్రత్యేకమైన 12 సైడెడ్ అకారం.
⇔ కొత్త నాణెం రెండు లోహాలతో తయారవుతుంది. నాణెం వెలుపలివైపు బంగారు రంగుతో (నికెల్ బ్రాస్), లోపలివైపు సిల్వర్ రంగుతో (నికెల్ ప్లేటెడ్ అలాయ్) ఉంటుంది.
⇔ నాణెంలో ఒక హోలోగ్రామ్ ఉంటుంది. దీన్ని అటూ ఇటూ తిప్పి చూస్తే పౌండ్ గుర్తు, ఒకటి గర్తు కనిపిస్తుంది.
⇔ కాయిన్‌కి రెండు వైపుల సూక్ష్మమైన అక్షరాలు ఉండటం. నాణెం చుట్టూ ఒకవైపు సంవత్సరం, మరొకవైపు దాని విలువ చిన్న చిన్న అక్షరాల రూపంలో ఉంటాయి.
⇔ ఇంకా నాణెంలో బయటకు కనిపించని భద్రతా ఫీచర్లు చాలానే ఉన్నాయంట.