నెటిజన్లపై శివమెత్తిన శ్రియ
తమిళసినిమా: ఇంటర్నెట్లో హాట్ హీరోయిన్స్ అని టైప్ చేస్తే చాలు అర్ధ నగ్నం, నగ్న హీరోయిన్ల ఫొటోలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వాటిలో కొన్ని మార్ఫింగ్ ముఖాలు కూడా కనిపిస్తాయి. కొందరు హీరోయిన్లు అయితే తమ అందాలను ఆరబోసే విధంగా కురచ దుస్తులు ధరించి ఫొటోలను తమ ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్ చేసి ఫ్రీ పబ్లిసిటీ పొందేస్తున్నారు. హిందీ చిత్రం జూలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ నటించిన దృశ్యాలను తిలకిస్తే అందులో ఆమె దాదాపు అర్ధనగ్నానికి ఎక్కువగా, నగ్నానికి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాంటి అశ్లీల దృశ్యాలకు గ్లామర్ అనే పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపించక మానదు.
గ్లామర్ విషయంలో నటి శ్రియ కూడా చాలా చిత్రాల్లో శృతి మించే నటించింది. అసలు అందానికి, అశ్లీలానికి తేడా ఏమిటన్న ప్రశ్నకు నటి శ్రియ ఆగ్రహంతో మండిపడింది. హీరోయిన్లు చీర కడితే వెంటనే పాత సంప్రదాయం అనేస్తారు. కాస్త మోడ్రన్ దుస్తులు ధరిస్తే అశ్లీలం, అసభ్యకరం అని విమర్శలు గుప్పిస్తారు. నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనూ దేనికదే అందం దాగుంటుంది. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. అయితే సమీపకాలంలో నెటిజన్లు మోడ్రన్ దుస్తులు ధరించిన హీరోయిన్ల గురించి చెడుగా రాసేస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తే చెడ్డవాళ్లా అంటూ విరుచుకుపడింది. చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా అందం అనే ఒక్కటే అని తనదైన బాణీలో అందానికి శ్రియ నిర్వచనం చెప్పింది.