బీటీ విత్తనాల రాయల్టీపై సర్కారుకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి విత్తనాల రాయల్టీ నిర్ణయం విషయంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. బీటీ విత్తనాల ప్యాకెట్‌కు రూ.50 రాయల్టీగా నిర్ణయిస్తూ వ్యవసాయశాఖ జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు నిలుపుదల చేసింది. జీవో మొత్తాన్ని కాకుండా కేవలం రాయల్టీపైనే హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులుగా ఉన్న వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్లకు నోటీసులిచ్చారు.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. బీటీ పత్తి విత్తనాల ధరలను, ప్రతీ ప్యాకెట్‌కు చెల్లించే రాయల్టీని నిర్ణయిస్తూ ముఖ్య కార్యదర్శి ఈ నెల 11న జీవో 238 జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ మహికో మోన్శాంటో బయోటెక్ ఇండియా, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రాయల్టీ నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇది పూర్తిగా విత్తన తయారీ కంపెనీకి సంబంధించిన విషయమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీ సహేతుకంగా లేదని, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట అమ్మకపు ధరపై అభ్యంతరం లేదన్నారు.