'ఫ్రీడం 251'తో లాభాలు కూడా వస్తాయట!
'ఫ్రీడం 251'.. ఇప్పుడు సాకేంతిక ప్రపంచంలో ఓ పెద్ద దుమారమే రేపుతోంది. అత్యాధునిక ఫీచర్లున్న 'త్రీజీ' స్మార్ట్‌ఫోన్‌ను అక్షరాల రూ. 251కే అందిస్తామంటూ ముందుకొచ్చిన రింగింగ్ బేల్స్ ప్రకటనపై ఇటు విమర్శలు అటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్న స్మార్ట్‌ఫోన్ అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? నిజంగా రూ. 251కే ఇస్తారా? ఆ ధరకు స్మార్ట్‌ఫోన్ అమ్మడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇది సాధ్యమే అంటోంది రింగింగ్ బేల్స్ కంపెనీ.
యాడ్‌కామ్ కంపెనీకి చెందిన ఐకాన్ 4 స్మార్ట్‌ఫోన్‌ను 'ఫ్రీడం 251'గా రీబ్రాండ్ చేసి అమ్ముతారని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఐకాన్ 4' రూ. 4వేలకు లభిస్తున్నది. దీని ఉత్పత్తి ధర మొత్తంగా చూసుకుంటే రూ. 2,546గా ఉంటుందని ఒక అంచనా. ఈ మొత్తంలో పదిశాతానికే మొబైల్ ఫోన్ అందిస్తామంటోంది రింగింగ్ బేల్స్. ఇదెలా సాధ్యం? ఇదేమన్నా మార్కెటింగ్ జిమ్మిక్కా?.. అంటే దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆ కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం రూ. 251కే అందించాలన్న సంకల్పంతో తాము ఈ సాహసానికి సిద్ధమయ్యామని ఆయన తెలిపారు. ఎంతో పరిశోధన చేసి.. ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.
అర్ధరాత్రి దాబాలో ఐడియా!
సాధారణంగా ఇలాంటి ఫీచర్లు ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్ రూ. 2,300 లేదా రూ. 2,400లకు లభిస్తుందని, ఈ నేపథ్యంలో రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందించాలన్న ఆలోచన ఝాన్సీ హైవేలో అర్ధరాత్రి వేళ ఓ దాబా వద్ద తనకు, తన సహోద్యోగి మోహిత్ గోయల్ (రింగింగ్ బేల్స్ డైరెక్టర్)కు వచ్చిందని ఆయన చెప్పారు. వెంటనే డ్రాయింగ్ రూమ్‌కు వచ్చి ఈ ఆలోచనపై కసరత్తు చేశామని, తుది లెక్కల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ కనీస ధరను రూ. 800 వరకు తగ్గించవచ్చునని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.
'మేకిన్ ఇండియా'లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురావడం వల్ల 13.8శాతం సుంకం (దాదాపు రూ. 450 నుంచి రూ. 470 వరకు) భారం తగ్గే అవకాశముంది. ఇక భారీగా ఉత్పత్తి చేపట్టడం వల్ల వ్యయం గణనీయంగా తగ్గి రూ. 530 వరకు ఆదా అయ్యే అవకాశముంది. దీనికితోడు ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే అమ్ముతుండటంతో మార్కెటింగ్, అమ్మకాల కోసం పెట్టే ఖర్చు దాదాపు రూ. 460 వరకు ఆదా అవుతుంది. ఈ లెక్కల ఆధారంగా ఒక మొబైల్‌ఫోన్‌ను రూ. 800 కనీస ధరకు అందించడం సాధ్యమేనని ఆయన చెప్పారు. అయితే, ఈ కనీస ధరకు అమ్మకం ధర రూ. 251కి మధ్య భారీగానే తేడా ఉంది. అయితే ఈ వ్యత్యాసాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని ఆయన చెప్ప్తున్నారు. ఈ పద్ధతిలో 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామని, దీనివల్ల తమకు భారీగా లాభాలు రాకపోయినా.. సహేతుకమైన ఆదాయం, లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు అశోక్ చద్దా చెప్తున్నారు. తాము స్థాపించబోయే మార్కెట్ వేదికను 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్‌లో బిల్ట్ ఇన్ యాప్‌గా రూపొందిస్తామని, ఈ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు భాగస్వామ్యులకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.