'ఫ్రీడం 251'.. గూడుపుఠాణి ఏంటో తేల్చండి!
న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నోయిడాకు చెందిన ఓ కంపెనీకి ముందుకురావడంపై మొబైల్ ఫోన్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సత్యాసత్యాలను వెలికితీయాలని కోరుతూ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ (ఐసీఏ) లేఖ రాసింది. ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చినా స్మార్ట్‌ఫోన్‌ను రూ. 3,500 కన్నా తక్కువ ధరకు అమ్మడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామనడం వెనుక ఉన్న రహస్యాలేమిటో వెలికితీయాలని ఐసీఏ తన లేఖలో కోరింది. ఈ మొబైల్ అమ్మకం వ్యవహారంలో పలు వివాదాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ చౌకైన మొబైల్ ఫోన్ ఆవిష్కరణకు ప్రభుత్వ పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరుకావడాన్ని తప్పుబట్టింది.
అత్యాధునిక ఫీచర్స్ ఉన్న త్రీజీ ఫోన్ 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామంటూ రింగింగ్ బేల్స్ కంపెనీ బుధవారం దీనిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి మొబైల్ ఫోన్ ప్రాడక్ట్‌ను రూపొందించడానికి కనీసం చౌక ఉత్పత్తి ధర 40 డాలర్లు (రూ. 2,700) అవుతుందని, దీనికి పన్నులు, సుంకాలు, పంపిణీ ఖర్చులు, రిటైల్ మార్జిన్ కలుపుకొంటే.. కనీసం ఎంతలేదన్న రూ. 4,100 ధర అవుతుందని, దీనిని ఎలా రూ. 251కి అందిస్తారని ఐసీఏ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహిందరో తన లేఖలో పేర్కొన్నారు. ఇలా చౌక ధరకు అందిస్తామనడం ప్రస్తుతం బూమ్ మీద ఉన్న భారత మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌ను దెబ్బతీయడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.