cheapest smartphone
-
సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్!
ఫ్రీగా వస్తోందంటే చాలు.. దేనికైనా వెంటపడతారు. వేల రూపాయల విలువైన వస్తువు వందల్లోనే వస్తోందన్నా అంతే. సరిగ్గా ఇప్పుడు కూడా అదే అయ్యింది. దాదాపు రూ. 3-4 వేల ఖరీదుచేసే స్మార్ట్‌ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామని చెప్పేసరికి జనం ఒక్కసారిగా ఆ సైట్ మీద పడ్డారు. ఒక్క సెకనులోనే 6 లక్షల హిట్లు రావడంతో దెబ్బకి ఫ్రీడమ్251 వెబ్సైట్ కాస్తా క్రాష్ అయ్యింది. గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని చెప్పడంతో, ఒక్కసారిగా నెటిజన్లు ఆ సైట్ మీద పడ్డారు. దాంతో తమ సైట్ క్రాష్ అయ్యిందని రింగింగ్ బెల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అద్భుతమైన స్పందన కనబర్చినందుకు థాంక్స్ అని, అయితే ఇంత భారాన్ని తట్టుకోలేక తమ సెర్వర్లు మూలపడ్డాయని ఆ సంస్థ తెలిపింది. తమ సెర్వర్ అప్‌గ్రేడ్ చేసుకుని, 24 గంటల్లో మళ్లీ వస్తామని చెప్పింది. 4 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3.2 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామనడంపై పలు వర్గాల నుంచి సందేహాలు వెల్లువెత్తాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ తొలుత ప్రకటించింది. జూన్ 30వ తేదీ నాటికి ఫోన్లు డెలివరీ చేస్తామని అంటూ.. డెలివరీ చార్జీల కింద మరో రూ. 40 కూడా వసూలు చేస్తోంది. -
'ఫ్రీడం 251'.. గూడుపుఠాణి ఏంటో తేల్చండి!
న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నోయిడాకు చెందిన ఓ కంపెనీకి ముందుకురావడంపై మొబైల్ ఫోన్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సత్యాసత్యాలను వెలికితీయాలని కోరుతూ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ (ఐసీఏ) లేఖ రాసింది. ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చినా స్మార్ట్‌ఫోన్‌ను రూ. 3,500 కన్నా తక్కువ ధరకు అమ్మడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామనడం వెనుక ఉన్న రహస్యాలేమిటో వెలికితీయాలని ఐసీఏ తన లేఖలో కోరింది. ఈ మొబైల్ అమ్మకం వ్యవహారంలో పలు వివాదాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ చౌకైన మొబైల్ ఫోన్ ఆవిష్కరణకు ప్రభుత్వ పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరుకావడాన్ని తప్పుబట్టింది. అత్యాధునిక ఫీచర్స్ ఉన్న త్రీజీ ఫోన్ 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామంటూ రింగింగ్ బేల్స్ కంపెనీ బుధవారం దీనిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి మొబైల్ ఫోన్ ప్రాడక్ట్‌ను రూపొందించడానికి కనీసం చౌక ఉత్పత్తి ధర 40 డాలర్లు (రూ. 2,700) అవుతుందని, దీనికి పన్నులు, సుంకాలు, పంపిణీ ఖర్చులు, రిటైల్ మార్జిన్ కలుపుకొంటే.. కనీసం ఎంతలేదన్న రూ. 4,100 ధర అవుతుందని, దీనిని ఎలా రూ. 251కి అందిస్తారని ఐసీఏ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహిందరో తన లేఖలో పేర్కొన్నారు. ఇలా చౌక ధరకు అందిస్తామనడం ప్రస్తుతం బూమ్ మీద ఉన్న భారత మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్‌ను దెబ్బతీయడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
మక్కీకి మక్కీ ఐఫోన్లా.. 'ఫ్రీడం 251'!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా 'ఫ్రీడం 251' దుమారం రేపుతోంది. నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఈ ఫోన్ ను రూ. 251కి అందిస్తామని ప్రకటించింది. గురువారం నుంచి ఆ కంపెనీ వెబ్సైట్లో దీని అమ్మకాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నది. అయితే ఈ కంపెనీ మీడియా కోసం విడుదల చేసిన శాంపిల్ యూనిట్ రివ్యూలో అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ డిజైన్‌ను 'ఫ్రీడం 251'లో పూర్తిగా కాపీచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యాపిల్ నుంచి దీనికి కాపీరైట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. బుధవారం సాయంత్రం విడుదలైన 'ఫ్రీడం 251' యూనిట్లో పలు సమస్యలు కూడా సమీక్షల్లో నిపుణులు గుర్తించారు. అయితే దీనిపై కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. 'ఫ్రీడం 251'లో ఉన్న చాలావరకు బిల్ట్ ఇన్ యాప్స్.. ఐఫోన్ నుంచి నేరుగా కాపీ చేసినవి కావడం గమనార్హం. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లలో కనిపించే సఫారీ వెబ్ బ్రౌజరే ఇందులోనూ కనిపిస్తున్నది. అంతేకాకుండా కంపెనీ వెబ్సైట్లో చూపించిన 'ఫ్రీడం 251' మోడల్ ఫొటోలకు, అది విడుదల చేసిన మొబైల్‌ఫోన్‌కు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. 'ఫ్రీడం 251' పూర్తిగా ఐఫోన్‌ను పోలినట్టు కనిపించడమే కాకుండా.. ఐఫోన్ హోమ్ బటన్ తరహాలోనే దీనికి కూడా హోమ్ బటన్ రౌండ్‌గా కనిపిస్తున్నది. మేడ్ ఇన్ ఇండియానా? ఈ స్మార్ట్‌ఫోన్‌పైన 'ఫ్రీడం 251' అని పెద్దగా రాసి ఉన్నప్పటికీ.. దీని అసలు బ్రాండ్ నేమ్ 'యాడ్‌కామ్' అని తెలుస్తున్నది. ఒరిజినల్ బ్రాండ్ పేరును వైట్నర్తో చెరిపేసి.. 'ఫ్రీడం 251' అని రాసినట్టు కనిపిస్తున్నది. 'యాడ్‌కామ్' అనేది న్యూఢిల్లీకి చెందిన ఐటీ దిగమతుల కంపెనీ. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లు అమెజాన్, స్నాప్‌డీల్, గాడ్జెట్స్ 360 వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో సుమారు రూ. 4వేలకు లభిస్తున్నాయి. ఇక 'ఫ్రీడం 251'లో స్వచ్ఛ భారత్, మహిళల భద్రత, యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి యాప్స్ ఉంటాయని అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నప్పటికీ.. ఈ మోడల్లో అలాంటి యాప్స్ ఏమీ లేకపోవడం గమనార్హం. అయితే మీడియాకు అవగాహన కోసం విడుదల చేసిన ఈ మోడల్ శాంపిల్ మాత్రమేనని, వినియోగదారులకు అమ్మబోయే 'ఫ్రీడం 251' మొబైల్ ఫోన్లలో తాము పేర్కొన్న అన్ని ఫీచర్స్, యాప్స్ ఉంటాయని రింగింగ్ బేల్స్ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.