రూ.5000 నోటు వస్తోందా?: ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ రూ.500. అయితే రూ.5,000 నోటు కూడా త్వరలో రాబోతుందని, కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఓ క్లారిటీ ఇచ్చింది.ఆర్బీఐ రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకున్న తరువాత.. వాటి స్థానంలో 5,000 రూపాయల నోట్లు (Rs.5000 Note) వస్తాయని కొందరు సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేశారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమే అని, దీనిని ఎవరూ నమ్మొద్దని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.దేశంలో అతిపెద్ద కరెన్సీభారతదేశంలో చాలా మందికి తెలిసిన అతిపెద్ద కరెన్సీ 2,000 రూపాయల నోటే. కానీ ఇండియాకు స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10,000, రూ.5,000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం బహుశా తెలియకపోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రవేశపెట్టిన రూ.10,000 నోటు.. అతిపెద్ద డినామినేషన్గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది. ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి.1978లో మొరార్జీ దేశాయ్ (Morarji Desai) నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10,000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5,000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10,000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి.ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లుభారతదేశంలో ప్రస్తుతం రూ. 500 నోట్లు మాత్రమే కాకుండా.. రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 నోట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా 2023 మే 19న ఆర్బీఐ రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత ఇప్పటివరకు వెనక్కి వచ్చిన రెండువేల రూపాయల నోట్లు 98.12 శాతం. అంటే ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.