గ్రహాంతర జీవుల కోసం రూ. 650 కోట్లు
లండన్: మానవ చరిత్రలోనే గ్రహాంతర జీవుల కోసం అతిపెద్ద పరిశోధనకు అంకురార్పణ జరిగింది. 100 మిలియన్ యూఎస్ డాలర్ల పైచిలుకు (దాదాపు రూ. 650 కోట్లు) ఖర్చుతో కూడుకున్న ఈ పరిశోధనలను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ సోమవారం ప్రారంభించారు. లండన్ లోని రాయల్ సొసైటీ సైన్స్ అకాడమీ ఇందుకు వేదిక అయింది. గ్రహాంతర జీవుల జాడ కనిపెట్టేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భారీ ప్రయోగం ఇదే.
రష్యాకు చెందిన బిలియనీర్, సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రెన్యూర్ యూరీ మిల్నర్ ఈ ప్రయోగానికి కావలసిన నిధులను సమకూర్చుతున్నారు. ప్రయోగం ప్రారంభం సందర్భంగా యంత్రపరికరాలద్వారా మాట్లాడిన స్టీఫెన్ హాకింగ్స్.. సువిశాల విశ్వంలో ఎక్కడో ఒక చోట ప్రాణులు ఉండే ఉంటాయన్నారు. శాస్త్ర అభ్యున్నతి కోసం కోట్లాది రూపాయల ఖర్చుచేసేందుకు ముందుకొచ్చిన యూరీని ప్రశంసించారు. ఇప్పటివరకు చేసినవాటికి భిన్నంగా అతి భారీ టెలిస్కోప్ ద్వారా గ్రహాంతర జీవులను అణ్వేషించనున్నట్లు తెలిపారు.