ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు
- రూ.180 కోట్లతో 587 ఆలయాల్లో ఏర్పాట్లు
- తిరుపతిలో అంతర్జాతీయ హిందూ సమ్మేళనం
- విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) : ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం తరఫున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.180 కోట్ల బడ్జెట్తో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని 587 ఆలయాల్లో కృష్ణా పుష్కరాలను శోభాయమానంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే టీటీడీ సారథ్యంలో త్వరలో తిరుపతిలో అంతర్జాతీయ హిందూసమ్మేళనం నిర్వహించనున్నట్లు వివరించారు.
తద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింజేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దశ దిశలా వ్యాంపించే విధంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న వైష్ణవాలయాల్లో జరిగే ఉత్సవాలకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, శైవాలయాలకు శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవస్థానాలనుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆలయాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఇక గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న అపశృతులను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన చర్యలు ముందస్తుగానే చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.