Rs.2 crores
-
2గంటల కార్యక్రమానికి రూ.2 కోట్ల ఖర్చు!
- ఒంగోలులో వేదిక ఏర్పాట్లకే రూ.కోటి - నగరంలో రోడ్లు, డివైడర్లకు హంగులు - అన్నింటికీ పచ్చరంగులు - ఆర్భాటాలకు పోతూనే రుణమాఫీకి నిధుల్లేవంటూ బీద పలుకులు ఒంగోలు (ప్రకాశం జిల్లా) : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ బీద పలుకులు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను పాల్గొనే సభలను మాత్రం ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. బాబు సభల్లో రిచ్‌నెస్ తగ్గితే అధికారులకు చీవాట్లే. ఖర్చు ఎంత అయినా సరే.. వేదిక పసుపుమయం కావల్సిందే. ఇక సభా ప్రాంగణాన్ని సైతం పర్మినెంట్ స్ట్రక్చర్లా నిర్మించటం పరిపాటి. అధికారులు కూడా మెప్పు కోసం పోటీపడి మరీ బాబు పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. రెండో విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు బుధవారం ఒంగోలు వస్తున్నారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు మరింత ఆర్భాటానికి పోతున్నారు. రెండుగంటల పాటు నిర్వహించే సభ కోసం వేదిక, ఆవరణలో సైతం పైకప్పు కార్పొరేట్ స్థాయిలో పర్మినెంట్ స్టక్చర్లా నిర్మిస్తున్నారు. ఇందుకోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పనులు హైదరాబాద్‌కు చెందినవారికి కాంట్రాక్టు అప్పజెప్పారు. ఒంగోలు మినీ స్టేడియం ప్రాంతంలో కొత్తరోడ్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ల తోపాటు పెద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. నగరంలో ప్రధాన రోడ్ల డివైడర్ల లో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డ్సు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పచ్చరంగులు అద్దారు. ఏడాది క్రితమే డివైడర్లకు రంగులు వేసినా సీఎం పర్యటన సాకుతో మరోమారు పచ్చరంగు వేస్తున్నారు. ఇందుకోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇక జనాల తరలింపుకు వందలాదిగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు. ఇందుకోసం మరో కోటిపైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ముఖ్యమంత్రి రెండు గంటల పర్యటనకు అధికారులు రూ.2 కోట్లకుపైనే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల రుణమాఫీకి నిధుల్లేవని చెప్పే చంద్రబాబు తన పర్యటనలకు మాత్రం కోట్లు తగలేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం
చెరుకుపల్లి : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.2 కోట్ల మేర స్థానికులకు టోపీ పెట్టాడు. దీనిపై సుమారు 80 మంది వరకు బాధితులు గురువారం సాయంత్రం చెరుకుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎం.రామదాసు అనే వ్యక్తి దగ్గర తాము చిట్టీలు వేశామని, కాగా గత రెండు నెలలుగా పాటలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా..
* పోలీస్ అధికారికే కట్న వేధింపులు *పెళ్లికొడుకు కుటుంబంపై ఫిర్యాదు విశాఖపట్నం: 'ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి... రూ. రెండు కోట్లు కట్నం, కేజీ బంగారం, అయిదు కేజీల వెండి ఇవ్వండి... ఇవి ఇస్తేనే వివాహం... లేదంటే మీ అమ్మాయిని వివాహం చేసుకోను... ప్రభుత్వం మాది..మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి...'అంటూ వివాహాన్ని ఆపేశాడో ప్రబుద్ధుడు. కుమార్తె వివాహం చేయడానికి కార్డులు పంచి, లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థ వేడుకలు చేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారికే వేదనను మిగిల్చాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పసల పర్వేశ్ విశాఖనగరం పెందుర్తిలోని ఓ రొయ్యల కంపెనీలో పని చేస్తున్నాడు. ఎంవీపీకాలనీలో నివాసముంటున్న ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తెతో పర్వేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె డెంటల్ విద్య చదువుతోంది. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. ఆడపడుచు కట్నం కింద ముందుగానే పర్వేశ్ కుటుంబ సభ్యులు రూ.పది లక్షలు తీసుకున్నారు. తర్వాత ఆగస్టులో విశాఖలోని ఆఫీసర్స్ క్లబ్లో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 12న వివాహ ముహర్తం పెట్టుకున్నారు. అయితే పర్వేశ్ పని చేస్తున్న సంస్థకు ఐస్ అవసరం ఉంది. దీంతో సొంతంగా ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించాడు. వధువు తండ్రి పోలీస్ ఉన్నతాధికారి కావడంతో కట్నం కింద రూ.రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో మీ అమ్మాయిని వివాహం చేసుకోనని చెప్పాడు. ప్రభుత్వం మాది... మీరేం చేసుకుంటారో చేసుకోండని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పర్వేశ్ స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు కూడా బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. వివాహాన్ని నిలిపేయడంతో వధువు తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆమేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ బృందం గాలిస్తోందని తెలిపారు.