- ఒంగోలులో వేదిక ఏర్పాట్లకే రూ.కోటి
- నగరంలో రోడ్లు, డివైడర్లకు హంగులు
- అన్నింటికీ పచ్చరంగులు
- ఆర్భాటాలకు పోతూనే రుణమాఫీకి నిధుల్లేవంటూ బీద పలుకులు
ఒంగోలు (ప్రకాశం జిల్లా) : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ బీద పలుకులు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను పాల్గొనే సభలను మాత్రం ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. బాబు సభల్లో రిచ్‌నెస్ తగ్గితే అధికారులకు చీవాట్లే. ఖర్చు ఎంత అయినా సరే.. వేదిక పసుపుమయం కావల్సిందే. ఇక సభా ప్రాంగణాన్ని సైతం పర్మినెంట్ స్ట్రక్చర్‌లా నిర్మించటం పరిపాటి. అధికారులు కూడా మెప్పు కోసం పోటీపడి మరీ బాబు పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు.
రెండో విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు బుధవారం ఒంగోలు వస్తున్నారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు మరింత ఆర్భాటానికి పోతున్నారు. రెండుగంటల పాటు నిర్వహించే సభ కోసం వేదిక, ఆవరణలో సైతం పైకప్పు కార్పొరేట్ స్థాయిలో పర్మినెంట్ స్టక్చర్‌లా నిర్మిస్తున్నారు. ఇందుకోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పనులు హైదరాబాద్‌కు చెందినవారికి కాంట్రాక్టు అప్పజెప్పారు. ఒంగోలు మినీ స్టేడియం ప్రాంతంలో కొత్తరోడ్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ల తోపాటు పెద్ద జనరేటర్‌లను సిద్ధం చేశారు. నగరంలో ప్రధాన రోడ్ల డివైడర్ల లో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డ్సు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పచ్చరంగులు అద్దారు.
ఏడాది క్రితమే డివైడర్లకు రంగులు వేసినా సీఎం పర్యటన సాకుతో మరోమారు పచ్చరంగు వేస్తున్నారు. ఇందుకోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇక జనాల తరలింపుకు వందలాదిగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు. ఇందుకోసం మరో కోటిపైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ముఖ్యమంత్రి రెండు గంటల పర్యటనకు అధికారులు రూ.2 కోట్లకుపైనే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల రుణమాఫీకి నిధుల్లేవని చెప్పే చంద్రబాబు తన పర్యటనలకు మాత్రం కోట్లు తగలేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2గంటల కార్యక్రమానికి రూ.2 కోట్ల ఖర్చు!
Published Tue, Jun 21 2016 8:25 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement