టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్చాలంటూ ఏలేశ్వరంలో ఇటీవల తమ్ముళ్ల ఆందోళన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీని బలోపేతం చేస్తామంటూ వచ్చిన చంద్రబాబు తమను గోదాట్లో ముంచి పోతున్నట్టుగా ఉందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సీట్లకు సెగ పెట్టేందుకే ఆయన వచ్చినట్టుగా ఉందని నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన వల్ల ప్రయోజనం మాట దేవుడెరుగు.. కొత్త సమస్యలతో తల బొప్పి కట్టిందంటున్నారు.
చంద్రబాబు పర్యటనలో టీడీపీ విభేదాలు రచ్చకెక్కి సిట్టింగ్‌ల సీట్లకు సెగ తగిలింది. తొలి రోజు బుధవారం రాజానగరంలో మొదలైన విభేదాలు చివరి రోజైన శుక్రవారం పెద్దాపురంలో కూడా కొనసాగాయి. అధినేత పర్యటనతో సీన్ రివర్స్ అయ్యిందని ఇన్‌చార్జిలు తల పట్టుకుంటున్నారు. వర్గ విభేదాలపై నియోజకవర్గ కార్యకర్తల సమీక్షల్లో చంద్రబాబు దాటవేశారని క్యాడర్ పెదవి విరుస్తున్నారు.
రాజానగరంలో కేరాఫ్ లేదు
చంద్రబాబు తీరుతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ రాజానగరం ఇన్‌చార్జి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తప్పుకున్న తరువాత ఆ పార్టీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. మరొకరిని ప్రకటిస్తారని ఎదురు చూశారు. పుట్టి మునిగిపోతున్న పార్టీ బరువు మోయడానికి నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ తరుణంలో తమ సామాజికవర్గానికే సీటు ఇవ్వాలంటూ బీసీకి చెందిన బార్ల బాబూరావు అసమ్మతి గళం వినిపించారు.
పెందుర్తి అనుయాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వ్యతిరేక వర్గం నుంచి బర్ల బాబూరావు మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఎవరూ దిక్కులేక ఇన్‌చార్జిగా తమ నేతనే కొనసాగిస్తున్నారని పెందుర్తి వర్గం బాహాటంగా చెప్పడమే వివాదానికి కారణమైంది. అందుకే కోరుకొండలో చైతన్య రథం పైకి చంద్రబాబు పిలిచినా పెందుర్తి వెళ్లలేదని తెలిసింది.
వర్మా.. ఇదేం ఖర్మ!
పిఠాపురం టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు తొలిసారి పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన వారందరూ ఒక్కటై జగ్గంపేటలో చంద్రబాబును కలిసి అసంతృప్తి గళం వినిపించారు. ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు వర్మతో విభేదిస్తున్నారు. ఈ వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.
వర్మ అసంతృప్తి వాదులు బాబును కలవడానికి నవీన్ ఆశీస్సులు లేకపోలేదని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరొచ్చినా నవీన్ కలుపుతారని ఆ వర్గం సమర్థించుకుంటోంది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురం నుంచి ఆ సామాజికవర్గ నేతలు నవీన్‌ను ప్రతిపాదిస్తున్నారు. అందుకే 40 కార్లలో వెళ్లి, వర్మకు సీటిస్తే పని చేసేది లేదని ఆయన వ్యతిరేకులు తమ అధినేతకు తెగేసి చెప్పారు. వర్మ సీటుకు ఎసరు పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయని వినికిడి.
మాజీ ఎమ్మెల్యే వర్మకు వ్యతిరేకంగా గళం విప్పిన తమ్ముళ్లు
ప్రత్తిపాడులో రోడ్డెక్కిన నిరసన
టీడీపీ ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల రాజాకూ నిరసన సెగ తాకింది. రాజాను తప్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో ఎనీ్టఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించే వరకూ వెళ్లారు. బీసీ నేత పైల సుభాష్ చంద్రబోస్‌కు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఏపూరి శ్రీను, రొంగల సూర్యారావు తదితరులు రచ్చ చేశారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూయేనని రాజా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జ్యోతుల మద్దతు లేకుండా బోస్ అంతటి సాహసం చేయలేరని అంటున్నారు. గత ఎన్నికల్లో నెహ్రూ తనయుడు, పార్టీ ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కు ఎంపీ సీటు రాకుండా రాజా అడ్డు పడ్డారనే చర్చ పార్టీలో ఉంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాంగం నడిపినందువల్లనే ఇప్పుడు బోస్ ద్వారా రాజాపై తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారని తెలుస్తోంది. బోస్‌కు ప్రమాదం జరిగితే జ్యోతుల పరామర్శకు రావడం, జగ్గంపేటలో నవీన్ పాదయాత్రకు బోస్ తరచూ వెళ్లి మద్దతు తెలపడం వీరి అవగాహనను చాటుతున్నాయి.
రాజప్పా.. మాకొద్దప్పా..
కాకినాడ జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు పక్కన ఉండగానే ఈయనకు పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తాకింది. రోడ్‌షో వేట్లపాలెం వెళ్లేసరికి మాజీ ఎమ్మె ల్యే దివంగత బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు ‘టీడీపీ ముద్దు – చినరాజప్ప వద్దు’ అంటూ నిరసనకు దిగారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన భాస్కర రామారావు స్థానే చినరాజప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి చినరాజప్పను ఎమ్మెల్యేను చేయాలని గురువారం రాత్రి పెద్దాపురంలో బాబు ప్రకటించారు.
చదవండి: టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..
దీంతో ఆశవహుల్లో అసంతృప్తి రాజుకుంది. పెద్దాపురం టిక్కెట్టు రేసులో చినరాజప్ప కాకుండా బొడ్డు సామాజికవర్గం నుంచి వెంకట రమణ, గుణ్ణం చంద్రమౌళి ఉన్నారు.æ చంద్రబాబు ప్రకటన ఆ వర్గీయుల్లో అసంతృప్తి రాజేసింది. వేట్లపాలెంలో తన కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామంతో అవాక్కైన చంద్రబాబు.. ఇది పద్ధతి కాదు అంటూనే దివంగత భాస్కర రామారావు సేవలను కొనియాడుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా ‘రాజప్పా గోబ్యాక్’ అంటూ వ్యతిరేకులు నినాదాలు చేశారు. మొత్తంమీద చంద్రబాబు మూడు రోజుల పర్యటనతో నియోజకవర్గ ఇన్‌చార్జిలు కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment