సాక్షి, కాకినాడ: స్వపక్ష నేతల మధ్య వైషమ్యాలను చక్కదిద్ద లేక చేతులెత్తేసిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ బయలుదేరడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై బురదజల్లే ఎత్తుగడతో తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజా స్పందన లేక అభాసుపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నాయకుడు ‘రాష్ట్రానికి ఇదేమి ఖర్మ’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ నినాదంతో గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారు. కొత్త నినాదం మాట దేవుడెరుగు.. కనీసం ఆయన పర్యటించే నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ అంతర్యుద్ధాలను చక్కదిద్దారా అంటే అదీలేదు.
ప్రజల నుంచి స్పందన లేక టీడీపీ అధినేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చాన్నాళ్లుగా ముఖం చాటేశారు. తెలుగు తమ్ముళ్లు వర్గాల బాట పట్టిన చోటే ఆయన తన పర్యటనకు శ్రీకారం చుట్టడంపై పార్టీ వర్గాలూ విస్తుపోతున్నాయి. పర్యటన సాగే కొవ్వూరు, నిడదవోలుతో పాటు పొరుగున ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో తమ్ముళ్ల తగువులతో పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైంది. సొంత సామాజికవర్గ నేతలు మాటలు ఆధారంగా ఏకపక్షంగా ఇన్‌చార్జిలను మార్చేయడం ఈ వివాదాలకు ఆజ్యం పోసింది.
గోపాలపురం– కయ్యాలకాపురం
గోపాలపురంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావును ఉన్నపళంగా ఇన్‌చార్జి నుంచి తొలగించాలరని ఎస్సీ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఇన్‌చార్జిగా మద్దిపాటి వెంకట్రాజును చంద్రబాబు నియమించారు. దీనిపై ముప్పిడి వర్గం బాబును కలిసింది. కారణం చెప్పాలంటూ నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీచేస్తారని ఆయన ప్రకటించారు. పర్యవసానంగా విభేదాల అగ్గి మరింత రాజుకుంది. వీరిద్దరూ తలోదారి పట్టినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ వైరుధ్యాల మధ్య జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాజీ ఎమ్మెల్యే ముప్పిడికి మద్ధతుగా నిలవడం చర్చనీయాంశమైంది. సంజాయిషీ కూడా అడకుండా కరివేపాకులా తీసిపడేసినందుకు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించేందుకు ముప్పిడి వర్గం గుట్టుగా పావులు కదుపుతోంది.
నిడదవోలులో తలోదారి
వైఎస్సార్‌సీపీ రాకతో అడ్రస్ గల్లంతైన నిడదవోలుకు చంద్రబాబు రానున్నారు. గత ఎన్నికల్లో 21వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఇక్కడ బాధ్య తలు అప్పగించవద్దంటూ ఆవిర్భావం నుంచి పార్టీ నేతలు మొత్తుకున్నారు. ఓటమి తరువాత బూరుగుపల్లి పార్టీని చాప చుట్టేసి కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఆయన రావడాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి.
మూడేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ హడావిడి చేయడం ద్వితీయ శ్రేణికి రుచించడం లేదు. మున్సిపాలిటీలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. గత ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ కుందూరు సత్యనారాయణ శేషారావుకు వ్యతిరేకంగా ఒక గ్రూపుతో టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణిలో మెజార్టీ నేతలు టిక్కెట్టు తెచ్చుకుంటే పనిచేస్తామని తెరవెనుక శేషారావుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఈ రెండు గ్రూపుల పంచాయతీ గురువారం చంద్రబాబు వద్దకు వెళ్లేలా ఉంది.
కొవ్వూరు.. విభేదాల జోరు
ఎస్సీలకు రిజర్వు అయిన కొవ్వూరులో గత ఎన్నికల్లో టీడీపీ ఘెరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. చంద్రబాబు గురువారం తన కార్యక్రమాన్ని కొవ్వూరు నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిని కూడా నియమించుకోలేని దీనావస్థ ఉంది. కొవ్వూరులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి తమను అవమానానికి గురిచేశారని ఎస్సీ సామాజికవర్గీయులు గుర్రుగా ఉన్నారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన వంగలపూడి అనిత పత్తా లేకుండా పోయారు. 2014లో గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహర్‌ను గత ఎన్నికల్లో పక్కనపెట్టారు. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయన్ను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబు ఆధిపత్యం తగ్గకూడదనే దోరణిలో చంద్రబాబు ఉన్నారంటూ ద్వితీయశ్రేణి గర్హిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ‘ఇదేం ఖర్మరా.. బాబు’ అంటూ పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి.
బూత్ కమిటీలు వేసే పరిస్థితే లేదు
చంద్రబాబు ఏలూరులో ప్రవేశించగానే ప్రజలందరూ ఇదే ఖర్మరా బాబు అని అనుకుంటున్నారు. బూత్ కమిటీలు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ఆ పార్టీ క్యాడర్ దూరంగా ఉంది. జగన్ పాలనలో ప్రజలందరూ సంక్షేమ పథకాలు అందుకుని ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ఏంచెప్పి మభ్య పెడతారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవడానికి జనాలు సిద్ధంగా లేరు.
– రాజమహేంద్రవరంలో మీడియాతో మంత్రి రోజా
Comments
Please login to add a commentAdd a comment