సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా చంద్రబాబు తీరు ఉందని తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడు నిందలు తమపై నెట్టేస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఒకప్పటి కంచుకోటలు వైఎస్సార్‌సీపీ ముందు నిలవలేక కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.
మూడేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికి కోసం పాకులాడే దయనీయ స్థితికి చేరుకుంది. పార్టీ రహితంగా అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోను 95 శాతం అమలు చేయడంతో ప్రధాన ప్రతిపక్షం విలవిలలాడుతోంది. దీంతో నానా యాతనా పడుతున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అధినేత చంద్రబాబు నుంచి సరైన దన్ను లభించడం లేదు. ఓటమికి తప్పంతా తమదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం వీరికి ఇబ్బందిగా పరిణమించింది.
కాకినాడలో కాక
జిల్లాలోని పలు నియోజకవర్గ ఇన్‌చార్జిలకు పొగబెడుతున్నారని టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల ఉన్న ఇన్‌చార్జిలనూ మార్చేస్తే మరికొన్నిచోట్ల నాథుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగానికి సగం నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోయిందనే నివేదికలు ఆ పారీ్టకి మింగుడుపడటం లేదు. జంట నియోజకవర్గాలైన కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌లో మూడు గ్రూపులు, ఆరు వర్గాలు అన్నట్టు పార్టీ ముక్కలైంది. నగరంలో పార్టీ వర్గాలుగా విడిపోవడానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలే కారణమని సుంకర వర్గం ఆరోపిస్తోంది. కొండబాబు, మాజీ మేయర్ సుంకర పావని వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి.
కొండబాబుకు ఉద్వాసన పలికి, ఇన్‌చార్జిగా పావనిని నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో వర్గపోరు ఇటీవల రచ్చకెక్కింది. కాకినాడ రూరల్ టీడీపీలోనూ రెండు వర్గాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మ, సత్తిబాబు దంపతుల నిర్వాకంతో పార్టీ ఖాళీ అయిపోయిందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఇదంతా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వర్గం చేస్తున్న దు్రష్పచారమని సత్తిబాబు వర్గం అంటోంది. చినరాజప్ప ప్రోద్బలంతో జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాసబాబా ఇన్‌చార్జి కోసం చేస్తున్న ప్రయత్నాలతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి.\
‘తూర్పు’లో కీచులాటలు
రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై ఇటీవల చంద్రబాబు తలంటేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశావ్, అ«ధికారంలో ఉండగా అనుభవించి ఇప్పుడు గాలికొదిలేస్తావా?’ అని చీవాట్లు పెట్టిన విషయం ఆ పార్టీ అనుకూల మీడియాలోనే బహిర్గతమైంది. దీంతో పార్టీని పట్టించుకోని పెందుర్తిని పక్కన పెట్టాలనే వాదనను నేతలు తెరపైకి తీసుకువచ్చారు.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సిటీపై ఇప్పటికీ ఆశ తగ్గక పోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలు కొనసాగుతున్నాయి. సిటీలో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీ సీనియర్ గన్ని కృష్ణ మూడో వర్గం ఎలానూ ఉండనే ఉంది.
గోపాలపురంలో ఇన్‌చార్జి మార్పు పెను ప్రకంపనలనే సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి మద్దిపాటి వెంక్రటాజుకు బాధ్యతలు అప్పగించడంతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ముప్పిడి, వెంకట్రావుల మధ్య తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో వైషమ్యాలు రచ్చకెక్కి చివరకు ఆ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బాబు సైతం వెంకట్రాజుకు మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది.
కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీని గ్రూపు తగదాలు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేఎస్ జవహర్ కొవ్వూరులోనే ఉంటున్నా స్థానికంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇక్కడి నాయకులు చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత అడ్రస్ లేకుండా పోవడాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ద్విసభ్య కమిటీని నియమించడాన్ని జవహర్ వర్గం వ్యతిరేకిస్తోంది.
కోనసీమ జిల్లాలో దిక్కెవరు?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు దాదాపు పొగ పెట్టినట్టేనని భావిస్తున్నారు. ఆనందరావును మాజీ హోంమంత్రి చినరాజప్ప వర్గం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా చినరాజప్ప వర్గం పరమట శ్యామ్‌ను ఇన్‌చార్జిని చేయాలనే ప్రయత్నాలు ఆ పార్టీలో అగ్గి రాజేశాయి. పి.గన్నవరంలో పారీ్టకి కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి అనంతరం ఇక్కడ టీడీపీ చుక్కాని లేని నావలా మారింది.
ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం బాధ్యతలను ప్రస్తుతానికి టీడీడీ మాజీ సభ్యుడు డొక్కా నాథ్‌బాబు చూస్తున్నారు. ఇన్‌చార్జి పదవి కోసం రాజమహేంద్రవరంలో స్థిరపడిన మందపాటి కిరణ్‌కుమార్ వెంపర్లాడటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులకు ఇస్తే తాడోపేడో తేలుస్తామంటూ డజను మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు వారం వారం భేటీ అవుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా దాదాపు పి.గన్నవరం పరిస్థితే కనిపిస్తోంది. టీడీపీ ఇక్కడ ఖాళీ అయిపోవడంతో కొత్తపేట నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ ఉనికి కోసం టీడీపీ ఆపసోపాలు పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment