అంతరాలు అంతం | Ys jagan Distribution of Registered Conveyance Deeds of House Plots in Ongole | Sakshi
Sakshi News home page

అంతరాలు అంతం

Published Sat, Feb 24 2024 2:40 AM | Last Updated on Sat, Feb 24 2024 7:48 AM

Ys jagan Distribution of Registered Conveyance Deeds of House Plots in Ongole - Sakshi

పేదలకూ పెద్దల తరహాలోనే
ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను  అధికారులందరినీ ఒకటే అడిగా. మీకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తోందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో, పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ  రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌  నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం.  - ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు.

నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి.  

రెండు రకాల రూల్సా..? 
దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి  ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా  ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం.

ఐఏఎస్‌లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్‌ డీడ్‌లతో రిజిస్ట్రేషన్‌ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం.  

చదువుల్లో అంతరాన్ని తొలగిస్తూ.. 
పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని మార్చేయాలనే తపనతో మన అడుగులు పడ్డాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు పేద పిల్లలు గవర్నమెంట్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుంటే డబ్బున్న వారి పిల్లలకు ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా మన గవర్నమెంట్‌ స్కూళ్లలో నాడు–నేడుతో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇంగ్లిష్‌ మీడియంతో పాటు బైలింగ్యువల్‌ బుక్స్, బైజూస్‌ కంటెంట్, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్‌ బోధన. ఐఎఫ్‌పీ ప్యానళ్లు అందుబాటులోకి తెచ్చాం. పేద పిల్లలు కాన్వెంట్‌ డ్రస్, షూస్‌ వేసుకుని చిరునవ్వుతో ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. సీబీఎస్‌ఈ నుంచి ఐబీ విద్యా విధానం స్థాయికి గవర్నమెంట్‌ బడులను తీసుకెళుతున్నాం.

పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి ప్రఖ్యాత వర్సిటీల నుంచి ఉచితంగా ఆన్‌లైన్‌లో కోర్సులు చదివేలా మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి  గర్వపడుతున్నా.  



పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం 
ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్‌ వైద్యం ఇవాళ పేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.  ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లింది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పరిధిని ­రూ.25 లక్షల వరకు ఉచితంగా విస్తరించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.

అంతేకాకుండా శస్త్ర చికిత్సల తరువాత రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా తెచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందుతోంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడం అంటే ఇదీ.  
 
బడుగు, బలహీన వర్గాలకు పదవులు
గతంలో పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన నామినేటెడ్‌ పదవులను చట్టం చేసి ఏకంగా 50 శాతం బడుగు, బలహీన వర్గాల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సామాజిక అంతరాలను చెరిపేయ­డం అంటే ఇదీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధి­కా­రత అంటే ఇదీ. పేదల  ఆంధ్రప్రదేశ్‌ వేరు... డబ్బున్న వారి ఆంధ్రప్రదేశ్‌ వేరు అనే భావా­లను పూర్తిగా తుడిచి వేస్తూ, పేదలకో న్యాయం – డబ్బున్న వారికో న్యాయం అనే విధానాలను రద్దు చేస్తూ మన అడుగులు పడ్డాయి.   

సచివాలయాల్లో సర్టిఫైడ్‌ కాపీలు.. 
రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ వల్ల ఆస్తిపై అక్కచెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు. సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్న విషయం సచివాలయాల్లో శాశ్వతంగా, భద్రంగా ఉంటుంది.

సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్కచెల్లెమ్మల ఫొటో తీసి జియోట్యాగింగ్‌ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరూ కబ్జా  చేయలేరు. పదేళ్లు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు, వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్‌గా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్‌గా హక్కులు సంక్రమిస్తాయి. ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచాం. ఎన్‌ఓ­సీ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.

బ్యాంకు రుణాలు కావాలంటే సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు అందుతాయి. నా అక్కచెల్లెమ్మలు, పేదలకు ఇచ్చే స్థలాలు, హక్కులు, ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో వారి బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతున్నాం.  

ఇంతకన్నా దారుణం ఉంటుందా? 
ఇవన్నీ చూస్తుంటే వంద మంది సినిమా విలన్ల కంటే, పురాణాల్లో రాక్షసులందరి కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అనిపిస్తుంది.  చివరికి అమరావతిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ ఆ పెద్దమనిషి నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి తన లాయర్లతో వాదించాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి జంకు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా?

గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దని వాదిస్తే తల్లిదండ్రులంతా గట్టి గుణపాఠం చెబుతారనే భయం లేకుండా చంద్రబాబు పాపిష్టి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా బరితెగించి తిరుగుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్‌! అని వ్యాఖ్యానిస్తే బీసీలంతా బుద్ధి చెబుతారన్న భయం కూడా లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా?

రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఉందా? 650 వాగ్దానాలిచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా ఎన్నికలొచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మేనిఫెస్టోతో సిద్ధమయ్యాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం.  

కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్, ఐజీ రామకృష్ణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీనియర్‌ ఐఏఎస్‌ ముత్యాలరాజు, కలెక్టర్‌ ఏఎస్‌.దినేష్‌కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సెంటు కూడా ఇవ్వకపోగా బాబు కుట్రలు.. 
2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నా కొందరు రాక్షసుల మాదిరిగా అవరోధాలు సృష్టించారు. అధికారంలో ఉండగా పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపానపోని చంద్రబాబు ఇవాళ మనం ఇస్తుంటే అడ్డుపడి ఆయన మనుషుల ద్వారా ఏకంగా 1,191 కేసులు దాఖలు చేశారు. వీటిని అధిగమించి ఇవాళ ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలిస్తున్నాం. ఒంగోలు అర్బన్‌లో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం యర్రజర్ల హిల్స్‌లో 866 ఎకరాలను 2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లే అవుట్లు సిద్ధం చేశాం.

ఈ గొప్ప కార్యక్రమానికి అడ్డుపడి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. ఒక్క ఒంగోలే కాకుండా ఏ జిల్లాలో చూసి­నా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలివ్వలేదు. మనం ఇస్తుంటే ఆయన అసూయ దాగ­టం లేదు.  ఇవన్నీ దాటుకుంటూ మీ బిడ్డ అడుగులు వేశాడు. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్‌.అగ్రహారం, వెంగముక్కపాలెం, యర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.210 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

మరో రూ.21.33 కోట్లు లే అవుట్‌ అభివృద్ధి కోసం వ్యయం చేస్తున్నాం. ఇదే ఎన్‌.అగ్రహారం, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్‌లో, వెంగముక్కపాలెం, యర్రజెర్లలో మరో 32 బ్లాక్స్‌తో జగనన్న మోడల్‌ టౌన్‌ షిప్స్‌ను పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. ఎస్టీపీ ప్లాంట్, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, వాటర్‌ సప్లయ్‌ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ఒంగోలుకు మంచి చేస్తూ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో రూ.339 కోట్లతో డ్రింకింగ్‌ వాటర్‌ స్కీమ్‌కు కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం.   

బైబై బాబు అంటున్న బాబు సతీమణి 
చంద్రబాబును నేను ఇవన్నీ ప్రశి్నస్తే నన్ను సవాల్‌ చేస్తున్నావా? అంటాడే కానీ ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఇదిగో ఈ ఈ మంచి చేశానని చెప్పలేడు. జగన్‌ మాదిరిగా బటన్‌ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాననే మాటలు ఈ పెద్దమనిషి నోట్లో నుంచి రావు. ఆయన చేయలేదు కాబట్టే  చెప్పలేడు. ఒకవైపు ఎన్నికలకు మనమంతా సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా అయన సిద్ధంగా లేరని అంటున్నారు. ఏకంగా కుప్పంలోనే బైబై బాబు.. అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్‌ డైలాగులు వస్తున్నాయి.

ఇలాంటి చంద్రబాబును రాష్ట్రంలో ప్రజలెవరూ సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించడంలేదు. ఏపీకి రానివారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు. నాకు ఆయన మాదిరిగా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మద్దతు లేవు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని కోరుతున్నా. నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు.  

అడ్డంకులను అధిగమించి..
అధికారంలోకి రాగానే అందరికీ స్థలాలు ఇవ్వడానికి 71,811 ఎకరాలను సేకరించి పంపిణీ చేశాం. 17,005 లే అవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీరు, పార్కులు, కామన్‌ ఏరియాలు, ఇతర సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 8.90 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఆ ఇంటి స్థలాల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. ఒంగోలులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇక్కడ రెండు లే అవుట్లలో పేదలకు ఇచ్చిన ఒక్కో స్థలం విలువే రూ.6 లక్షలు కాగా రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాల కోసం మరో రూ.లక్ష దాకా వెచ్చిస్తున్నాం.

ఇలా ఇల్లు పూర్తయ్యే సరికే ఒక్కో ఇంటి విలువ రూ.10 లక్షలు పైమాటే ఉంటుందని చెప్పడానికి సంతోషపడుతున్నా. అక్కచెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా విలువైన స్థిరాస్తిని పెడుతున్నాం. తద్వారా ఏకంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. 

మహిళలకు ఆర్థిక సాధికారత, భద్రత 
పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలతోపాటు దిశ యాప్, సచివాలయంలో మహిళా పోలీసుల ద్వారా అండగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ అందుతున్నాయి. ఇవన్నీ  గతంలో లేవు. మన పథకాల ఫలితంగా మహిళా ఆర్థిక సాధికారత పెరిగింది.

అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడం కాదు.. నిన్ననే విడుదలైన జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. గత 58 నెలల్లో డీబీటీతో ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగా ఇందులో 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందించగలిగాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement