రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా.. | Wedding stopped mid-way after bridegroom demands dowry | Sakshi
Sakshi News home page

రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా..

Published Wed, Dec 17 2014 1:40 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా.. - Sakshi

రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా..

 * పోలీస్ అధికారికే కట్న వేధింపులు
 *పెళ్లికొడుకు కుటుంబంపై ఫిర్యాదు

 
విశాఖపట్నం: 'ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి... రూ. రెండు కోట్లు కట్నం, కేజీ బంగారం, అయిదు కేజీల వెండి ఇవ్వండి... ఇవి ఇస్తేనే వివాహం... లేదంటే మీ అమ్మాయిని వివాహం చేసుకోను... ప్రభుత్వం మాది..మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి...'అంటూ  వివాహాన్ని ఆపేశాడో ప్రబుద్ధుడు. కుమార్తె వివాహం చేయడానికి కార్డులు పంచి, లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థ వేడుకలు చేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారికే వేదనను మిగిల్చాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివి.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పసల పర్వేశ్ విశాఖనగరం పెందుర్తిలోని ఓ రొయ్యల కంపెనీలో పని చేస్తున్నాడు. ఎంవీపీకాలనీలో నివాసముంటున్న ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తెతో పర్వేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె డెంటల్ విద్య చదువుతోంది.  ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. ఆడపడుచు కట్నం కింద ముందుగానే పర్వేశ్ కుటుంబ సభ్యులు రూ.పది లక్షలు తీసుకున్నారు. తర్వాత ఆగస్టులో విశాఖలోని ఆఫీసర్స్ క్లబ్‌లో  నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 12న వివాహ ముహర్తం పెట్టుకున్నారు. అయితే పర్వేశ్ పని చేస్తున్న సంస్థకు ఐస్ అవసరం ఉంది. దీంతో సొంతంగా ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించాడు.

వధువు తండ్రి పోలీస్ ఉన్నతాధికారి కావడంతో కట్నం కింద రూ.రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో మీ అమ్మాయిని వివాహం చేసుకోనని చెప్పాడు.  ప్రభుత్వం మాది... మీరేం చేసుకుంటారో చేసుకోండని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పర్వేశ్ స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు కూడా బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు.  వివాహాన్ని నిలిపేయడంతో వధువు తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆమేరకు  కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.  నిందితుడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ బృందం గాలిస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement