ఈ వాహనాలపై రూ.2.17లక్షల తగ్గింపు
ముంబై: జూలై1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం వాహన తయారీ సంస్థల డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ కోవలో తాజాగా టాటా మోటార్స్ జత చేరింది. జీఎస్టీ ప్రయోజనాలను తమ వినియోగదారులకు చేరవేయాలని భావిస్తున్నట్టు టాటామోటార్స్ ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాల ధరలపై రూ. 3,300-2.17 లక్షల మేర తగ్గించింది.
వాహన దిగ్గజం టాటా మోటార్స్ భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది. పాసెంజర్ వెహికల్స్‌పై రూ.3వేలనుంచి 2.17 లక్షల వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమల్లోకి తేనున్న నేపథ్యంలో మోడల్ , వేరియంట్ పై ఆధారపడి 12 శాతం వరకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నట్టు టాటా మోటర్స్ ప్రెసిడెంట్, (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పార్ఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 3,300 ల నుంచి రూ .2,17,000 వరకు ధర తగ్గింపు ఉండనుందని తెలిపారు. జిఎస్టీని ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నును అమలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం చర్యను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక కొత్త శకాన్నిసృష్టింసుందని పేర్కొన్నారు
కాగా మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగ వాహనాలు, ఎస్‌యూవీల ధరలను సగటున 6.9 శాతం తగ్గించింది. అదేవిధంగా, కంపెనీ చిన్న వాణిజ్య వాహనాల ధరలను కూడా తగ్గించింది. జీఎస్టీ అనంతరం హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్, ద్విచక్ర వాహనాల తయారీదారులైన టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ), సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీలు తగ్గింపుధరలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.