రాంపాల్ అరెస్ట్ ఖర్చు అక్షరాలా రూ.26 కోట్లు
హర్యానా: వివాదాస్పద బాబా రాంపాల్ అరెస్ట్‌కు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయం అక్షరాలా రూ. 26.61 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం పంజాబ్ హర్యానా హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. రాంపాల్ అరెస్ట్ నిమిత్తం హర్యానా రూ.15.43 కోట్లు, పంజాబ్ రూ.4.34 కోట్లు, ఛండీగఢ్ యంత్రాంగం రూ.2.29 కోట్లు, కేంద్రం రూ.3.55 కోట్లు ఖర్చు పెట్టాయి. వెరసి ఈ అరెస్ట్ ఆపరేషన్ కు .. రూ.26.61 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం.
కాగా రాంపాల్ అరెస్ట్ సందర్భంగా గాయపడినవారి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం హర్యానా డీజీపీ ఎస్.ఎన్.వశిస్ట్ను ఆదేశించింది. రాంపాల్ ను అరెస్టు చేయడం కష్టమని, దీనికి చాలా ఖర్చవడంతో పాటు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని పోలీసులు కోర్టుకు చెప్పారు. అయితే, ఎంత ఖర్చయినా అరెస్టు చేయాల్సిందేనని, ఆ ఖర్చంతటినీ రాంపాల్ నుంచే రాబట్టాలని కూడా కోర్టు పోలీసులకు తెలిపింది. దాంతో ఇప్పుడు మొత్తం రూ. 26.61 కోట్ల మొత్తాన్ని రాంపాల్ నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. మరోవైపు హత్య కేసుకు సంబంధించి రాంపాల్‌ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరు పరిచారు.