ప్రభుత్వ విద్యుత్ బకాయి రూ.350 కోట్లు
- బిల్లు కట్టని వారికి నోటీసులు పంపాం
- విద్యుత్‌శాఖ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి
మడకశిర : జిల్లా వ్యాప్తంగా రూ.350 కోట్ల ప్రభుత్వ విద్యుత్ బకాయిలు ఉన్నట్లు ఆశాఖ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాలిటీలు రూ.30 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఎక్కువగా కదిరి, రాయదుర్గం, మడకశిర, ధర్మవరం మున్సిపాలిటీలు ఎక్కువ విద్యుత్ బకాయిలు పడ్డాయని తెలిపారు. అలాగే జిల్లాలోని స్థానిక సంస్థలు రూ.140 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ రూ.65 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లకు సంబంధించి రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉందని చెప్పారు. గృహ వినియోగదారుల బకాయిలు కూడా రూ.20 కోట్ల వరకు వసూలు అవ్వాల్సి ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి రూ.20 కోట్లు, సత్యసాయి తాగునీటి పథకానికి సంబంధించి రూ.55 కోట్లు, పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించి రూ.10 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ బకాయిలను చెల్లించాలని ఆయా శాఖల అధికారులకు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో హిందూపురం డీఈ శేషగిరిరావు, ఏడీఈ రవిప్రసాద్ ఉన్నారు.