Rs.5 lakhs
-
రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు
నల్గొండ : నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం శివారులో శనివారం వేగంగా వెళ్తున్న కోళ్ల వ్యాను ఎదురుగా వస్తున్న పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యాను డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కోళ్ల వ్యానులో ఉన్న దాదాపు 1500 కోళ్లను స్థానికులు తమ వెంట తీసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాల వ్యానును సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న కోళ్ల వ్యాన్ ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. -
ప్రాణం ఖరీదు రూ. 5 లక్షలు
రైల్వేకోడూరు: విధి నిర్వహణలో ఉన్న ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడంతో ఆ సంస్థ ప్రతినిధులు స్థానిక పెద్దలతో మధ్యవర్తిత్వం చేసి ప్రాణం ఖరీదు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట గనులలో ఆదివారం త్రివేణి ప్రైవేటు సంస్థకు చెందిన కార్మికుడు కుంచం నారాయణ (55) డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తూ కుప్పకూలాడు. ఇతను డ్రిల్లింగ్ విభాగంలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంకాలం విధులకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున డ్రిల్లింగ్ పనిచేస్తూ ఊపిరి ఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మృతిచెందాడు. ధూళి కాలుష్యంతో ఊపిరాడక చనిపోయాడని కొందరు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని మరికొందరు అంటున్నారు. దీంతో కార్మికుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బికమ్మపల్లె గ్రామానికి చెందిన నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతిరోజూ చేసే పనుల కంటే అధికంగా చేయాలని డ్రిల్లింగ్ విభాగంలో పనిచేసే కార్మికులను రెండు రోజులుగా ఒత్తిడి అధికమైంది. ఇందులో భాగంగానే డ్రిల్లింగ్ పనులు వేగవంతంలో కార్మికుడు నారాయణ ఊపిరాడక మృతిచెందాడు. మైనింగ్ చట్టాలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయోనని తవ్వకాల కాంట్రాక్టర్ గుండెపోటుగా చిత్రీకరించారు. కాంట్రాక్టర్‌తో ప్రభుత్వ అధికారులు చేతులు కలిపారు. నిరుపేద అయిన మృతుని కుటుంబాన్ని ఓవైపు బెదిరింపులు, మరోవైపు పరిహారంతో మభ్యపెట్టి వాస్తవాలను వక్రీకరించి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
అంబాజీపేటలో అగ్ని ప్రమాదం
అంబాజీపేట: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఓ పాత సామాను దుకాణంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రూ. 5లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఫైర్ ఇంజిన్‌తో అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
రూ. 5 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
ఏటూరునాగారం: కిరాణా షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన భవాని కిరాణ దుకాణంలో అక్రమంగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో దుకాణంలో సోదాలు జరిపి రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దుకాణ యజమాని శివప్రసాద్ రూ. 1.20 లక్షల విలువ చేసే టేకు చక్కలను అక్రమంగా నిల్వ ఉంచినట్టు పోలీసలు గుర్తించారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని టేకు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
హయత్‌నగర్‌లో దొంగలు బీభత్సం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లో గత అర్థరాత్రి ఓ ఇంట్లో దొంగలు చోరబడి బీభత్సం సృష్టించారు. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించి... 20 తులాల బంగారంతోపాటు రూ. 50 వేల నగదును చోరీ చేశారు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారైయారు. స్థానికుల సహాయంతో బాధితులు గురువారం ఉదయం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.