rta department
-
రోడ్డున పడ్డ భద్రత!
ఓవర్ స్పీడ్‌కు కళ్లెం ఏది? - రాష్ట్రంలోని ముంబై,విజయవాడ(65), బెంగళూర్ (44), భూపాలపట్నం (163) జాతీయ రహదారులపై వాహనాలు మితి మీరిన వేగంతో దూసుకెళుతున్నాయి. కార్లు గంటకు 90–120 కి.మీ., ప్రైవేటు లారీలు, బస్సులు 120 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో వెళుతున్నాయి. ఈ రహదారులపై స్పీడ్‌కు ఎలాంటి కళ్లెం లేదు. స్పీడ్గన్లు లేవు. - ఆయా రహదారులపై గూడ్స్ వాహ నాలు పలువురు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్నాయి. వీటిని పోలీసులు, ఆర్టీఏ అధికారులు అడ్డుకోవడంలేదు. తూతూ మంత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తేనే! మామూలు జరిమానాలను ఎవరూ పెద్దగా ఖాతరుచేయడంలేదు. ఓవర్‌స్పీడ్ విభాగం లోనే గత ఆరునెలల్లో ఏకంగా రూ.46 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఓవర్లోడిం గ్‌కు రూ.2కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా ఇలాంటి డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇంతకాలం ఓవర్‌స్పీడ్‌కు కేవలం రూ.400 మాత్రమే జరిమానా విధించేవారు. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే రూ.1000తోపాటు వాహనంలో ఎంతమంది ఉంటే అన్ని రూ.2000 చెల్లించాలి. అప్పుడుగానీ కాస్త మార్పు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు లేని వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. వాటిలోనే కూలీలు ప్రయాణిస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి కూలీలు మరణించినా వారి కుటుంబాలకు పరిహారం దక్కదు. అలాంటి వాహనాలు ఎక్కడమే చట్టవిరుద్ధమైనపుడు వాటి వల్ల ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలకు కోర్టులు న్యాయం చేయవు. – ఆటో అండ్ మోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ - ఇటీవల మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్చిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 13 మంది చనిపోయారు. - గతేడాది జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద 100 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కందకంలో పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. - ఓవర్‌లోడ్ వాహనాలపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే ఈ రెండు ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరిగిందని రోడ్డు భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డుభద్రత ‘నేతి బీరలో నెయ్యి చందం’ అయింది. భద్రతకు భరోసా లేకుండా పోయింది. ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్ వాహనాలకు కళ్లెం వేసేనాథుడు లేడు. ఆర్అండ్ బీ, ఆర్టీఏ శాఖలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తు న్నాయి. ఫలితంగా రహదారులు రక్తధారలుగా మారుతున్నాయి. పెద్దసంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
ఒకే వాహనం.. ఒకే కోడ్ AP 39
రవాణా శాఖలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని తీసుకొస్తున్న ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మరోసారి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికే రవాణా శాఖలో ప్రతిదీ ఆన్లైన్ చేసిన ఆయన తాజాగా రాష్ట్రమంతటా ఒకే రిజిస్ట్రేషన్ కోడ్‌కు శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాల వారీగా కొనసాగిన రిజిస్ట్రేషన్ కోడ్లు రద్దు కానున్నాయి. ఇకపై కొత్త వాహనాలకు జిల్లాకు ప్రత్యేక కోడ్ ఉండదు. ఏపీ–39 సిరీస్ పేరిట ఇక రాష్ట్రమంతటా ఒకే కోడ్ అమల్లోకి రానున్నట్లు తెలసుస్తోంది. 15 రోజుల్లో అమలుకానున్న ఈ నూతన విధానం వల్ల కృష్ణా జిల్లా ఆదాయం ‘9’ రెట్లు పెరగనున్నట్లు సమాచారం. సాక్షి, అమరావతిబ్యూరో : రాబోయే రోజుల్లో ఏదైనా వాహనానికి 9999 లాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాహన యజమాని ఇకపై అలాంటి నంబర్ల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు పక్క జిల్లాల్లో తాత్కాలిక చిరునామాతో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్న వాహనదారుల ఆటలు ఇక సాగబోవు. ఏపీ రవాణా శాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో ఇకపై రాష్ట్రమంతటా ఒకే సిరీస్ కోడ్ పేరిట వాహనాలకు నంబర్లను కేటాయించనున్నారు. జిల్లాలో ‘ఏపీ–16’కు సెండాఫ్.. ఏపీ –16.. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ కోడ్ నంబరు. ఈ కోడ్ త్వరలో కనుమరుగవబోతోంది. రానున్న 15 రోజుల తర్వాత ఈ కోడ్ నంబరు ఏపీ–39గా మారనుంది. ఏపీ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లా అంతటా ఒకే కోడ్ నంబర్ అమల్లోకి రానుంది. కొత్త సిరీస్ ప్రారంభం కావటం వల్ల రెండు రోజుల్లోనే 1–9999 నంబర్ల సిరీస్ మారిపోయే అవకాశం ఉంది. తద్వారా నెలలోనే 15సార్లు కొత్త సిరీస్ అంకెలు వచ్చేస్తుంటాయి. జిల్లాకు ‘9’ రెట్ల ఆదాయం.. లగ్జరీ వాహనాలకు కృష్ణా జిల్లా పెట్టింది పేరు. దేశంలో ఏ కొత్త మోడల్ వాహనం వచ్చినా పదుల సంఖ్యలో ఆ వాహనాలను ఇక్కడ బడాబాబులు కొనుగోలు చేయడం పరిపాటి. బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైనా వాహనాలు కృష్ణా జిల్లా రహదారులపై సర్వసాధారణమయ్యాయి. రూ. కోట్ల విలువైన వాహనాలకు యజమానులు రూ. లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకుంటుంటారు. అయితే చాలా వాహనాలకు ఉత్తరాంధ్ర, రాయలసీమ రిజిస్ట్రేషన్ కోడ్‌తో ఫ్యాన్సీ నంబర్లు ఉంటున్నాయి. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఉండటంతో ఇప్పటిదాకా పక్క జిల్లాలకు వెళ్లి తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించుకుంటున్నారు. రవాణా శాఖ రాష్ట్రమంతటా ఒకే రిజిస్ట్రేషన్ కోడ్ తీసుకురావడంతో ఇకపై కృష్ణా జిల్లావాసులు పక్క జిల్లాలకు వెళ్లాల్సిన పనిలేదు. తాజా నిర్ణయంతో ఫ్యాన్సీ నంబర్లకు తీవ్ర పోటీ ఉంటుంది కాబట్టి ఈ ఆదాయం ‘9’ రెట్లకు పెరిగే అవకాశం ఉందని జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. -
నేటి నుంచి ఎల్ఎల్ఆర్ మేళా !
రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నేటి నుంచి 23వ తేదీ వరకు మళ్లీ ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు. స్పాట్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డీటీసీ మీరాప్రసాద్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ: రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈనెల 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేసేందుకు మేళాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇ.మీరాప్రసాద్ తెలిపారు. స్పాట్లో ఎల్ఎల్ఆర్ స్లాట్లు బుక్ చేసేందుకు రవాణా శాఖ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మేళాలు నిర్వహించే గ్రామాలు.. ♦ 17న పెనమలూరు మండలం యనమలకుదురు, విజయవాడలోని రామకృష్ణాపురం, 18న కంకిపాడు మండలం తెన్నేరు, మంతెన, 19న జి.కొండూరు మండలం కవులూరు, 20న గన్నవరం, పెనమలూరు, 21న జి.కొండూరు మండలం వెలగలేరు, విజయవాడ రూరల్ మండలం నున్న, 22న గణపవరం, పెనమలూరు మండలం గోసాల, 23న విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జి.కొండూరు మండలం వెల్లటూరులో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తారు. అర్హతలు ఇవి.. ♦ 18 ఏళ్లు వయస్సు పూర్తయిన సర్టిఫికెట్ ఉండాలి. ♦ ఆధార్ కార్డు జత చేయాలి. ♦ ఒక పాస్‌పోస్టు సైజు పోర్టు అవసరం. ♦ 50ఏళ్లు, ఆపైబడిన వయస్సు ఉన్న వారు ఫారం 1ఏతో మెడికల్ సర్టిఫికెట్ జతచేయాలి. ♦ బైక్, కారులో ఒక దానికి రూ. 260లు, రెండింటికి కలిపి రూ. 410లు ఎల్ఎల్ఆర్ ఫీజు చెల్లించాలి. -
తప్పెవరిది?
రహదారులు మృత్యుదారులుగా.. వాహనాలు మృత్యుశకటాలుగా మారాయి.. బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. మైనర్లు, అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.. ఆయా ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలు, క్షతగాత్రులు కోలుకోలేని దెబ్బతింటున్నారు.. గద్వాల క్రైం: ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లిన వారు.. సొంత పనులపై బయటకు వెళ్లి వారు ప్రస్తుతం క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మనం సరిగానే వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వారు క్షణకాలంలో చేసే చిన్నపొరపాటు నిండు జీవితాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ఎంతో భవిష్యత్ ఉన్న మైనర్లు, యువకులు, కుటుంబం ఆధారపడి ఉన్న యజమానులు మృత్యువాత పడుతూ.. కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అ లంపూర్ మండలాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వపరంగా నివారణ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం.. వాహనదారుల అవగాహన లేమితో అవేమీ ప్రమాదాలను అడ్డుకోలేకపోతున్నాయి. రోడ్డు భద్రతపై ఏదీ చిత్తశుద్ధి వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం అనే విషయాన్ని డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలి.. ఎలా ముందు వెళ్తున్న వాహనాలను దాటాలి.. తదితర విషయాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒకింత ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయంలో ఇటు రవాణా శాఖ, అటు పోలీసు అధికారులు నామమాత్రంగా తనిఖీలు జరుపుతూ చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు డ్రైవర్లు నిద్రలేమి, మద్యం మత్తులో వాహనాలను నడపడం కూడా గమనార్హం. అవగాహన లేని వారే అధికం ఒక వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా ఆ దారిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖాధికారులు జారీ చేసే లైసెన్స్ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. రాత్రివేళలో హెడ్ ల్యాంపులు, ఇండిగేటర్లు వేస్తూ వాహనాలకు ఎలా సంకేతాలు ఇవ్వాలి.. అనే విషయాలపై ప్రస్తుత డ్రైవర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదు. ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చు. ఇవిగో ఘటనలు.. జనవరి 8న ధరూరు మండలం చిన్నపాడు, యమునోనిపల్లికి చెందిన కొంతమంది గద్వాలలోని ఓ పత్తి మిల్లులో కూలికి వెళ్లేవారు. తిరిగి వచ్చే క్రమంలో బొలేరో డ్రైవర్ నిర్లక్ష్యం.. నిద్రలేమి కారణంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. æ 9వ తేదీన ఉండవెల్లి మండలం మునగాలకు చెందిన మధుసూద న్ అనే విద్యార్థి ద్విచక్రవాహనంపై వస్తుండ గా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతిచెం దాడు. æ 12వ తేదీన మానవపాడు దగ్గర జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. æ 14వ తేదీన బీచుపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మృతిచెందారు. నివారణ చర్యలేవీ.. గద్వాల– అయిజ, గద్వాల– ధరూరు, గద్వాల– ఎర్రవల్లి తదితర రోడ్డు మార్గంలో ప్రభుత్వం నూతనంగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. అయితే వివిధ ప్రాంతాల్లో రోడ్డు వేస్తున్న క్రమంలో అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళలో ఎరుపు రంగు రేడియం స్టిక్కర్ సూచకలు పెట్టాలి. మూల మలుపులు, స్పీడ్ బ్రేకర్లు ఇలా ప్రతిచోట ప్రమాదాలను నివారించేలా బోర్డులు ఉంచాలి. కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. తూతూమంత్రంగా నిర్వహణ.. ప్రతియేటా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి 11 నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. అలాగే 25వ తేదీ నుంచి ఆర్టీసీ యాజమాన్యం సైతం భద్రతా వారోత్సవాలు జరుపుతుంది. అయితే వీటిని ఆయా అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇందులో సంబంధిత అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. రోడ్డు ప్రమాదాల నివారణకు మా శాఖ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రవాణా శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాల్లో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. కొందరు ప్రజలను కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
ఆర్టీఏలో ఆన్లైన్
– చిల్లరనోట్లు ఉన్నా ఇబ్బందిపడ్డ వాహనదారులు – అధికారుల హడావుడి నిర్ణయాలే కారణమంటూ ఆవేదన అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ అధికారులు తీసుకున్న హడావుడి నిర్ణయాల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శుక్రవారం నుంచి నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని ఉన్నఫలంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వాహనదారులకు కాదు కదా.. అశాఖలో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా తెలియక పోవడం గమనార్హం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వాహన రిజిస్ర్టేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర సమస్యలపై వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిల్లర నోట్లు తెచ్చుకున్నా అధికారులు తీసుకోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు.. రోడ్డు రవాణాశాఖలో(ఆర్టీఏ) డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్, అపరాధ రుసుం చెల్లించేందుకు రోజూ వందల మంది వస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత చిల్లర సమస్య తీవ్రంగా ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం విజయవాడ నుంచి రవాణశాఖ అధికారులు స్వైప్ మిషన్ తెప్పించారు. గురువారం వరకూ అకౌంట్లలో డబ్బు ఉన్న వాహనదారులు స్వైప్ మిషన్ ద్వారా, చిల్లర నోట్లు ఉన్న వాహనదారులు చలానా కోసం నేరుగా డబ్బు చెల్లించేవారు. దీంతో రవాణాశాఖలో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. శుక్రవారం మాత్రం అన్ని లావాదేవీలు నగదు రహితంగా స్వైప్ మిషన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. రవాణాశాఖలో నేరుగా డబ్బులు తీసుకోరనే అంశం ప్రజలకు తెలియపర్చలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఉన్నట్లుండి శుక్రవారం ఉదయం డబ్బులు తీసుకోం.. అని చెప్పేసరికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొంతమంది నిరాశతో వెనుతిరగగా.. మరికొందరు దగ్గర్లో తెలిసిన వ్యక్తులు ఉంటే వారి ఖాతాల నుంచి చాలానాలు చెల్లించారు. ఇక్కడకు వచ్చాక చెప్పారు బొలెరో వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేషన్ కోసం కార్యాలయంకు వచ్చా. ఇక్కడికొచ్చాక డబ్బులు తీసుకోమని చెబుతున్నారు. దీంతో దగ్గర్లో తనకు తెలిసిన వారు ఉంటే వారి అకౌంట్ నుంచి నగదు చెల్లించాను. ముందస్తుగా తెలియజేయకుండా నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది వెనక్కుపోయారు. - : అయూబ్‌ఖాన్, పేరూరు, రామగిరి మండలం ముందుగా చెప్పలేదు ఆటోకు జరిమానా వేశారు. డబ్బులు చెల్లించి ఆటోను విడిపించుకుందామని వస్తే డబ్బులు తీసుకోలేదు. దీంతో గుత్తి నుంచి నా అల్లుడుని రమ్మని చెప్పా. అధికారులు ముందుగా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం వలన ఒక పనికి రెండు పనులు అయ్యాయి. - మహ్మద్‌వలి, ఆటోడ్రైవర్, గుత్తి ప్రభుత్వ ఆదేశాల మేరకే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ ఆదేశాల అనుసరించి శుక్రవారం నుంచి నగదు రహిత లావాదేవీలు చేపట్టాం. తాత్కాలికంగా ఇబ్బంది పడ్డా .. భవిష్యత్‌లో చిల్లర నోట్ల సమస్య పరిష్కారం అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించాం.- : శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం