తప్పెవరిది? | no road safety in gadwal disctirct | Sakshi
Sakshi News home page

తప్పెవరిది?

Published Mon, Jan 29 2018 5:38 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

no road safety in gadwal disctirct - Sakshi

ప్రయాణికులను తరలిస్తూ బోల్తాపడిన బొలేరో వాహనం (ఫైల్‌)

రహదారులు మృత్యుదారులుగా.. వాహనాలు మృత్యుశకటాలుగా మారాయి.. బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. మైనర్లు, అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.. ఆయా ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలు,  క్షతగాత్రులు కోలుకోలేని దెబ్బతింటున్నారు..   

గద్వాల క్రైం: ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లిన వారు.. సొంత పనులపై బయటకు వెళ్లి వారు ప్రస్తుతం క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మనం సరిగానే వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వారు క్షణకాలంలో చేసే చిన్నపొరపాటు నిండు జీవితాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ఎంతో భవిష్యత్‌ ఉన్న మైనర్లు, యువకులు, కుటుంబం ఆధారపడి ఉన్న యజమానులు మృత్యువాత పడుతూ.. కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అ లంపూర్‌ మండలాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వపరంగా నివారణ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం.. వాహనదారుల అవగాహన లేమితో అవేమీ ప్రమాదాలను అడ్డుకోలేకపోతున్నాయి.
 
రోడ్డు భద్రతపై ఏదీ చిత్తశుద్ధి
వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం అనే విషయాన్ని డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలి.. ఎలా ముందు వెళ్తున్న వాహనాలను దాటాలి.. తదితర విషయాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒకింత ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయంలో ఇటు రవాణా శాఖ, అటు పోలీసు అధికారులు నామమాత్రంగా తనిఖీలు జరుపుతూ చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు డ్రైవర్లు నిద్రలేమి, మద్యం మత్తులో వాహనాలను నడపడం కూడా గమనార్హం.

అవగాహన లేని వారే అధికం
ఒక వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా ఆ దారిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖాధికారులు జారీ చేసే లైసెన్స్‌ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. రాత్రివేళలో హెడ్‌ ల్యాంపులు, ఇండిగేటర్లు వేస్తూ వాహనాలకు ఎలా సంకేతాలు ఇవ్వాలి.. అనే విషయాలపై ప్రస్తుత డ్రైవర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదు.  ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చు.  

ఇవిగో ఘటనలు..
జనవరి 8న ధరూరు మండలం చిన్నపాడు, యమునోనిపల్లికి చెందిన కొంతమంది గద్వాలలోని ఓ పత్తి  మిల్లులో కూలికి వెళ్లేవారు. తిరిగి వచ్చే క్రమంలో బొలేరో డ్రైవర్‌ నిర్లక్ష్యం.. నిద్రలేమి కారణంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. æ 9వ తేదీన ఉండవెల్లి మండలం మునగాలకు చెందిన మధుసూద న్‌ అనే విద్యార్థి  ద్విచక్రవాహనంపై వస్తుండ గా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతిచెం దాడు. æ 12వ తేదీన మానవపాడు దగ్గర జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. æ 14వ తేదీన బీచుపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో  తిమ్మాపూర్‌  మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ మృతిచెందారు.

నివారణ చర్యలేవీ..
గద్వాల– అయిజ, గద్వాల– ధరూరు, గద్వాల– ఎర్రవల్లి తదితర రోడ్డు మార్గంలో ప్రభుత్వం నూతనంగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. అయితే వివిధ ప్రాంతాల్లో రోడ్డు వేస్తున్న క్రమంలో అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళలో ఎరుపు రంగు రేడియం స్టిక్కర్‌ సూచకలు పెట్టాలి. మూల మలుపులు, స్పీడ్‌ బ్రేకర్లు ఇలా ప్రతిచోట ప్రమాదాలను నివారించేలా బోర్డులు ఉంచాలి. కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.

తూతూమంత్రంగా నిర్వహణ..
ప్రతియేటా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి 11 నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. అలాగే 25వ తేదీ నుంచి ఆర్టీసీ యాజమాన్యం సైతం భద్రతా వారోత్సవాలు జరుపుతుంది. అయితే వీటిని ఆయా అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇందులో సంబంధిత అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  

కఠినంగా వ్యవహరిస్తాం..
రోడ్డు ప్రమాదాల నివారణకు మా శాఖ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రవాణా శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్‌ వాహనాల్లో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. కొందరు ప్రజలను కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని ప్రధాన  రహదారులపై సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement