RTC depots
-
సౌర వెలుగులు.!
మదనపల్లె సిటీ: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్‌పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్‌ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్‌స్టేషన్, జెడ్పీహైస్కూల్ ప్రాంగణాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్‌ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం. మదనపల్లె ఆర్టీసీ డిపోలు.. తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. బస్ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమిత్ సంస్థ టెండర్ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్‌స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. ఇతర డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. పూర్వ విద్యార్థి సహకారం.. జెడ్పీ పాఠశాలకు వరం పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన రవిసుబ్రమణ్యం ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన చిన్నప్పుడు మదనపల్లెలో చదువుకున్నాడు. ఆయనకు విద్యబోధించిన ఉపాధ్యాయుడు ఫణీంద్ర ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది మదనపల్లెకు వచ్చినప్పుడు తన గురువును కలిసి సన్మానం చేయాలనుకున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు నిరాకరించి పాఠశాలలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఆయన అభ్యర్థన మేరకు రూ.4.50 లక్షల వ్యయంతో సోలార్ ప్లాంట్‌ను గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 60 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా 50 సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను పాఠశాలలోని 55 గదుల్లో ఫ్యాన్లు, లైట్లకు వినియోగించేలా వైరింగ్ చేశారు. పాఠశాల ఆవరణంలో తాగునీటి కోసం బోరు కూడా వినియోగిస్తున్నారు. గతంలో నెలకు రూ. 15 వేలు నుంచి 18 వేలు వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.2 వేలు లోపే వస్తోంది. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, కార్యాలయంతో పాటు అవసరం ఉన్నచోట్ల సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికల్లో భాగంగా మదనపల్లె డిపోలోని బస్‌స్టేషన్‌పై సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి నెలకు రూ. లక్ష వరకు ఆదా అవుతోంది. –వెంకటరమణారెడ్డి, వన్ డిపో మేనేజర్.మదనపల్లె దాతలు ముందుకు రావాలి మా పాఠశాలలో 2,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖతర్‌లో పని చేసే రవిసుబ్రమణ్యం సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయం. దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. –రెడ్డె్డన్నశెట్టి, హెచ్ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె -
ఆర్టీసీ డిపోల్లో భారీగా సంబరాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల్లో బుధవారం పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. డిపోల్లో కార్మికులు స్వీట్లు పంచుకుని ‘థ్యాంక్యూ సీఎం’ కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆర్టీసీ కార్మికులు జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా తమను ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయని నినదించారు. ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభలు నిర్వహించారు. ఆర్టీసీ విలీనాన్ని నూతన సంవత్సర కానుకగా ఇవ్వడం చారిత్రాత్మక ఘట్టమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. యూనియన్ కార్యాలయాల్లోనూ కేక్‌లు కట్ చేసి సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిపోల్లో జరిగిన సభల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలు పాల్గొని సంబరాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయడంతో ఇన్నేళ్లు జీతం భద్రత, ఉద్యోగ భద్రత లేని తమ జీవితాల్లోముఖ్యమంత్రి వెలుగులు కురిపించారంటూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు సభ నిర్వహించారు. కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సీఎం చరిత్రలో నిలిచిపోతారని మంత్రి పేర్ని నాని కొనియాడారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సంబరాలు జరిపారు. తిరుపతిలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేతలు అలిపిరి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు డిపోల్లో కృతజ్ఞత సభలు నిర్వహించారు. -
'బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు ఉంటాయి'
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు ఉంటాయని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి వెల్లడించారు. కొత్త ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో రోడ్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆన్లైన్ ద్వారా సేవలు విస్తరిస్తున్నామని చెప్పారు. రవాణా శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని తెలిపారు. వాహనదారులకు హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రవాణా శాఖ ఆదాయ లక్ష్యం రెండు వేల కోట్ల రూపాయల్లో 90 శాతం పూర్తి చేసినట్టు పి. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
ఆర్టీసీ డిపోల్లో సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు బస్టాండ్లకే పరిమితమైన సీసీ కెమెరాలను ఇక బస్సు డిపోల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గ్యారేజీల్లో బస్సుల మెయింటెనెన్స్ నిర్వహణలో సిబ్బంది పనితీరును పరిశీలించడం, సకాలంలో బస్సులు నడిచేలా చూడడం, బస్సులు, డిపోల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడం ప్రధాన లక్ష్యాలుగా వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొన్ని డిపోల్లో జరుగుతున్న చోరీల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 60 డిపోల్లో, 600 కెమెరాలను తొలుత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించి జంటనగరాల పరిధిలోని 27 డిపోలు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 33 డిపోల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. నెలరోజుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. వీటి ఏర్పాటుతో ఒనగూరే ప్రయోజనాలను సమీక్షించి అవసరమైతే మిగతా డిపోల్లో దశలవారీగా ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ కార్యదర్శి రవీందర్ పేర్కొన్నారు. మళ్లీ బయోడీజిల్ ప్రయోగం... ఆర్టీసీకి అతిపెద్ద భారంగా ఉన్న చమురు ఖర్చును తగ్గించుకునే క్రమంలో బయోడీజిల్‌ను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో బయోడీజిల్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించినప్పటికీ, దాని లభ్యతలో ఇబ్బంది, డీజిల్ కంటే ధర పెరగడం... తదితర కారణాలతో ఆ ప్రయోగాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు డీజిల్ కంటే తక్కువ ధరకే బయోడీజిల్‌ను సరఫరా చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు రావడంతో మళ్లీ అధికారులు ఆ ప్రక్రియ వైపు దష్టి సారించారు. ప్రస్తుతం ఆర్టీసీ సంవత్సరానికి దాదాపు 50 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఇందులో 10 బయోడీజిల్‌ను కలిపి వాడడం వల్ల సం్థకు రూ.30 కోట్ల మేర వార్షిక ఆదా నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు బస్సులు విడుదల చేసే హైడ్రోకార్బన్లు, కార్బన్ మోనాకై ్సడ్‌లను బాగా తగ్గించే అవకాశం ఉంటుంది. బయోడీజిల్ సరఫరా చేసే సంస్థలను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.