బుధవారం విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల్లో బుధవారం పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. డిపోల్లో కార్మికులు స్వీట్లు పంచుకుని ‘థ్యాంక్యూ సీఎం’ కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆర్టీసీ కార్మికులు జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా తమను ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయని నినదించారు. ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభలు నిర్వహించారు. ఆర్టీసీ విలీనాన్ని నూతన సంవత్సర కానుకగా ఇవ్వడం చారిత్రాత్మక ఘట్టమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. యూనియన్ కార్యాలయాల్లోనూ కేక్‌లు కట్ చేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డిపోల్లో జరిగిన సభల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలు పాల్గొని సంబరాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయడంతో ఇన్నేళ్లు జీతం భద్రత, ఉద్యోగ భద్రత లేని తమ జీవితాల్లోముఖ్యమంత్రి వెలుగులు కురిపించారంటూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు సభ నిర్వహించారు. కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సీఎం చరిత్రలో నిలిచిపోతారని మంత్రి పేర్ని నాని కొనియాడారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సంబరాలు జరిపారు. తిరుపతిలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేతలు అలిపిరి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు డిపోల్లో కృతజ్ఞత సభలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment