19కేసులవిచారణ
ఆర్టీఐ కమిషనర్ విజయబాబు
విశాఖ, విజయనగరం
అపీళ్లపై విచారణ
కాకినాడ సిటీ :
సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు 19 కేసులకు సంబంధించిన అపీళ్లపై విచారణ నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టుహాలులో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల అప్పీళ్లపై విచారణ చేపట్టారు. పాడేరు పంచాయతీరాజ్ పరిధిలో గ్రామీణ రహదారుల ఏర్పాటులో గ్రావెల్ అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన అపీల్పై విచారణ నిర్వహించి పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ సవివర విచారణ నివేదిక పంపించాలని ఆదేశించారు. ఎస్.రాయవరం మండలంలో హుదూద్ తుఫానులో రికార్డులు పోయాయంటూ, ఎంపీడీఓ అపీల్దారు కోరిన సమాచారం ఇవ్వనందున సంబంధిత జిల్లా అధికారిని విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విశాఖ జిల్లా శృంగవరపుకోటకు చెందిన భూములకు సంబంధించి సివిల్ డిస్ప్యూట్ పరిష్కారం నిమిత్తం కోర్టుకు వెళ్లాలని కమిషనర్ సూచించారు. రామాపురం పంచాయతీ కార్యదర్శి అపీల్ విచారణకు హాజరుకానందున అప్పీలెంట్కు అతని జీతం నుంచి నష్టపరిహారం చెల్లించాలని, ఎంపీడీఓకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని సూచించారు. విజయనగరం జిల్లా ఆలూరు మండలంలో ప్రజా ఆరోగ్యం గురించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా సంబంధిత డీపీఓకు దరఖాస్తు చేయగా, ఎటువంటి సమాచారం ఇవ్వనందున ఆలూరు ఈఓపీఆర్డీ, విజయనగరం డీఎంహెచ్ఓ విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.