గోదావరి డెల్టాలో రబీ ప్రశ్నార్థకమే!
- రీడిజైన్ పేరుతో గోదావరిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ
- రోజుకు సగటున 68,132 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రణాళిక
- డెల్టాలో ఖరీఫ్ చివరి దశలో నీటికి కటకటే.. ఇక రబీ సాగు ప్రశ్నార్థకమే
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైన్ పూర్తయితే.. డెల్టాలో రబీ సాగు ప్రశ్నార్థకమవుతుందని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. రబీ పంట వరి సాగు చేయకపోతే భూగర్భ జలమట్టం తగ్గుతుందని.. ఉప్పు నీళ్లు పైకి ఉబికి రావడం వల్ల డెల్టా మొత్తం ఉప్పునీటి కయ్యలుగా రూపాంతరం చెంది, బంజరుగా మారడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం చంద్రబాబునాయుడు నోరుమెదపడం లేదు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడుతున్నారు.
- మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్లు నిండాలంటే 35 టీఎంసీల నీళ్లు అవసరం.
- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్ల నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు 33,600 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకులగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 68,132 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వాడుకోనుంది.
- గోదావరి నది పరీవాహక ప్రాంతంలో జూన్లో కురిసిన వర్షాలకు ప్రస్తుతం వరద నీళ్లు రాష్ట్రానికి చేరుతున్నాయి. కానీ.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే వరద నీళ్లు రాష్ట్రానికి చేరడం కనీసం నెల ఆలస్యమవుతుంది. గోదావరి డెల్టాలో జూన్ నుంచి నవంబర్ 15 వరకూ ఖరీఫ్, డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ వరకూ రబీ పంటలను సాగు చేస్తారు.
- జూన్ నుంచి అక్టోబరు వరకూ సగటున 60 రోజులపాటూ గోదావరికి భారీ ఎత్తున వరద వస్తుంది. అక్టోబరు తర్వాత ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల ద్వారా గోదావరిలోకి వచ్చే నీళ్లే డెల్టాకు ఆధారం. 2015, అక్టోబరు నుంచి 2016, ఏప్రిల్ వరకూ సీలేరు, బలిమెల రిజర్వాయర్లలో జల విద్యుదుత్పత్తి చేసి విడుదల చేసిన వాటితో కలిపి ధవళేశ్వరం బ్యారేజీకి సగటున ఏడు వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు.
- ఒక్క గోదావరి డెల్టాకే రబీలో కనీసం 16 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం. పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తాడిపూడి, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు మరో 20 వేల క్యూసెక్కులు అవసరం. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. అక్టోబరు తర్వాత గోదావరి నుంచి చుక్క నీరు కూడా రాష్ట్రానికి చేరదు. అప్పుడు శబరి, సీలేరుల నీళ్లే ఆధారం. సీలేరు, శబరిల ద్వారా ఏడు వేల క్యూసెక్కులకు మించి లభించవు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే డెల్టాలో రబీ సాగు అసాధ్యమని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.
- 194.6 టీఎంసీల నిల్వ.. 301 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తే ఇబ్బందులను అధిగమించవచ్చు. కానీ.. చంద్రబాబు కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టి పోలవరం ప్రాజెక్టును నీరుగార్చారు. ఇప్పుడు తెలంగాణ అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా నోరుమెదపడం లేదు.
- జూన్ 1, 2015 నుంచి నవంబర్ 30, 2015 వరకూ ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా 1609 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే.. ఇందులో కనీసం 301 టీఎంసీలను వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రజల తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండేవి కాదు.