తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడి
58 శాతానికి పడిపోయిన సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు కబళిస్తోంది.. ఇప్పటికే ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు దెబ్బతీయగా.. ఇప్పుడు రబీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 60 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా.. పంటల సాగు 58 శాతానికి తగ్గిపోయింది. భూగర్భ జలాలు కూడా సాధారణంతో పోలిస్తే మూడు మీటర్లకు పైగా లోతులోకి పడిపోయాయి. దీంతో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని వారం వారం విడుదల చేసే నివేదికలో భాగంగా వ్యవసాయశాఖ వెల్లడించింది. రబీలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా 122.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 49.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.
మెదక్‌లో రబీ సాగు 21 శాతమే..
రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సాగు బాగా తగ్గిపోయింది. సాధారణంగా రబీ సీజన్‌లో మొత్తంగా 13.09 లక్షల హెక్టార్లలో సాగు జరగాలి. అందులో ప్రస్తుత సమయానికి 4.68 లక్షల హెక్టార్లలో సాగు ప్రారంభంకావాల్సి ఉండగా... 2.72 లక్షల హెక్టార్లలోనే (58%) పంటలు వేశారు. జిల్లాల వారీగా చేస్తే మెదక్‌లో అత్యంత తక్కువగా 21 శాతమే రబీ సాగు చేపట్టారు. ఇక నల్లగొండ జిల్లాలో 30 శాతం, రంగారెడ్డిలో 48 శాతం, ఆదిలాబాద్‌లో 50 శాతం, ఖమ్మంలో 52 శాతం, నిజామాబాద్ జిల్లాలో 57 శాతం పంటల సాగు జరిగింది.
రాష్ట్రానికి కరువు దెబ్బ
Published Thu, Nov 27 2014 3:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement