భక్త విజయం: రుద్రాక్షధారణ ఫలితం
చంద్రసేనుడు కశ్మీర రాజు. అతడి కొడుకు సుధర్ముడు. చంద్రసేనుడి మంత్రి గుణనిధి. రాజు కొడుకు సుధర్ముడికి మంత్రి కొడుకు తారకుడికి బాల్యం నుంచి స్నేహం ఏర్పడింది. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. రాజు కొడుకు, మంత్రి కొడుకు ఇద్దరూ ఐశ్వర్యంలో పుట్టిపెరిగిన వారే! ఇద్దరూ అందగాళ్లే! అయినా వారికి రత్నాభరణాలను ధరించడం మీద ఏమాత్రం మోజు ఉండేది కాదు. వారిద్దరూ శివపూజా తత్పరులు. శరీరంపై భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించేవారు. ఎందరు ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా, వారు రత్నాభరణాలను ధరించేవారు కాదు. ఆ బాలురిద్దరి ప్రవృత్తి మిగిలిన బాలురి కంటే కొంత విచిత్రంగా ఉండేది.
ఒకనాడు పరాశర మహర్షి చంద్రసేనుడి వద్దకు వచ్చాడు. చంద్రసేనుడు ఎదురేగి పరాశరునికి స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. ఆయనకు ఈ విచిత్ర బాలురిద్దరినీ పరిచయం చేశాడు. ‘స్వామీ! ఇతడు నా కుమారుడు సుధర్ముడు. అతడి పక్కనున్నవాడు నా మంత్రి కుమారుడు తారకుడు. వీరిద్దరి ప్రవర్తన కొంత వింతగా ఉంటోంది. మిగిలిన బాలల మాదిరిగా అలంకరణలపై ఆసక్తి చూపరు. శరీరంపై నిత్యం భస్మత్రిపుండ్రాలు ధరించి, రుద్రాక్షమాలలు వేసుకుని తిరుగుతుంటారు. మేమంతా ఎంతగా నచ్చచెప్పినా రాజోచితమైన రత్నాభరణాలను ధరించడం లేదు. వీరికి బాల్యంలోనే ఇంతటి వైరాగ్య ప్రవృత్తి ఎందుకు కలిగిందో మాకెవరికీ అర్థం కావడంలేదు. మీరే వీరి సంగతి చెప్పాలి’ అన్నాడు చంద్రసేనుడు.
పరాశరుడు దివ్యదృష్టితో ఆ బాలురిద్దరి వృత్తాంతాన్నీ గ్రహించాడు.
‘రాజా! దిగులు చెందకు. వీరి ప్రస్తుత ప్రవృత్తికి కారణం వీరి పూర్వజన్మలోనే ఉంది’ అంటూ ఆ బాలురి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు.
‘పూర్వం నందిగ్రామంలో మహానంద అనే గణిక ఉండేది. ఆమె మహా ఐశ్వర్యవంతురాలు. ఆమె సౌధంలో రత్నరాశులు విరివిగా ఉండేవి. పాడిపంటలతో ఆమె సమృద్ధిగా తులతూగేది. సర్వాలంకారభూషితగా ఉండేది. కులవృత్తిరీత్యా ఆమె స్వేచ్ఛాసంచారిణిగా ఉండేది. అయినా, ఆమె శివదీక్షా తత్పరురాలు. తన ఇంట నిత్యం శివపూజ చేసేది. శివాలయాలకు విరివిగా దానాలు చేసేది. శివభక్తులైన బ్రాహ్మణులను ఆదరించి, వారు కోరిన దానాలు ఇచ్చేది.
వినోదం కోసం ఆమె ఒక కోతిని, ఒక కోడిని పెంచుకునేది. వాటికి భస్మత్రిపుండ్రాలతోను, రుద్రాక్షలతోను అలంకరించేది. వాటిని నాట్యమండపానికి తీసుకొచ్చి, వాటితో ఆటలాడించేది. రుద్రాక్షలు ధరించిన కోతి బాలకునిలా ఆ గణిక ముందు నృత్యం చేసేది. కోతి నృత్యాన్ని చూసి కోడి కూడా నాట్యమాడేది. వాటి ప్రదర్శన చూపరులకు ఆనందం కలిగించేది. ఇలా చాలాకాలం గడిచింది.
ఒకనాడు శివదీక్షాపరుడైన ఒక వర్తకశ్రేష్ఠుడు ఆ గణిక ఇంటికి వచ్చాడు. భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షమాలలు, రత్నకంకణ కేయూరాది ఆభరణాలను ధరించి, చూడటానికి అపర కుబేరుడిలా ఉన్నాడు.
మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడిని సాదరంగా ఆహ్వానించి, పూజించింది. అతడికి సపర్యలు చేసింది. అతడితో కబుర్లాడుతూ, ‘మహాత్మా! మీరు ధరించిన రత్నకంకణం స్త్రీలు ధరిస్తే శోభిస్తుంది. మీ కంకణం ధరించాలని నాకు మక్కువగా ఉంది’ అని అంది.
‘అంత కోరికగా ఉంటే నా కంకణాన్ని నీకిస్తాను. మరి దీనికి మూల్యంగా ఏమిస్తావు?’ అన్నాడు ఆ వర్తకుడు.
‘అయ్యా! నేను గణికను. మీ కంకణాన్ని నాకు అనుగ్రహిస్తే, అందుకు బదులుగా మూడు రోజులు మీకు భార్యగా నడుచుకోగలను’ అని బదులిచ్చింది.
అందుకు సంతోషంగా సమ్మతించిన వర్తకశ్రేష్ఠుడు ఆమెకు తన కరకంకణాన్ని ఇచ్చాడు. దానితోపాటు రత్నఖచితమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు. ‘ఈ శివలింగం నాకు ప్రాణప్రదమైనది. దీనిని జాగ్రత్తగా భద్రపరచు. దీనికి భంగం కలిగితే, నాకు ప్రాణభంగమే’ అని చెప్పాడు.
మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడు ఇచ్చిన కంకణాన్ని అలంకరించుకుని, అతడిచ్చిన శివలింగాన్ని తన పూజామందిరంలో భద్రపరచింది. నాటి రాత్రి ఆ వర్తకుడితో గడిపి నిద్రించింది. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఆ గణిక ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల వేడికి మేలుకున్న గణిక ఇంట్లో కట్టేసి ఉన్న కోతికి, కోడికి కట్లు విప్పి వాటిని బయటకు విడిచిపెట్టింది. ఇంటిని మంటలు కమ్మేస్తుండటంతో ఆమె, ఆమె వెనుకనే వర్తకుడు బయటకు వచ్చేశారు.
వాళ్లు చూస్తుండగానే ఇల్లు భస్మీపటలమైంది. పూజామందిరంలో భద్రపరచిన శివలింగం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ప్రాణప్రదమైన శివలింగం దగ్ధమవడంతో ఆ వర్తకుడు ప్రాణత్యాగం చేశాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం అతడితో మూడురోజులు గడపాల్సి ఉండగా, అతడు ఒక రోజు గడిచేసరికే ప్రాణత్యాగం చేయడంతో ఆ గణిక చాలా దుఃఖించింది. ఆమె కూడా అతడితో పాటే ప్రాణత్యాగం చేసింది. ఆమె విడిచిపెట్టిన కోతి, కోడి కొన్నాళ్లకు కాలధర్మం చెందాయి.
గణిక వద్ద పెరిగినప్పుడు భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించిన కోతి, కోడి ఇప్పుడు నీకు, నీ మంత్రికి కొడుకులుగా పుట్టారు. పూర్వజన్మ స్నేహమే వారి మధ్య నేటికీ కొనసాగుతోంది. ధార్మికులైన వీరిద్దరూ మీ తర్వాత జనరంజకంగా ప్రజలను పరిపాలించి, చివరకు శివసాయుజ్యాన్ని చేరుకుంటారు’ అని చెప్పాడు పరాశరుడు.
–సాంఖ్యాయన
ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!