బాలకృష్ణకు యాప్ట్!
‘‘ఓ అభిమానిగా బాలకృష్ణగారితో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ తరహా చిత్రం నిర్మించాలనుకున్నాను. ఆ చిత్రాల్లా శక్తిమంతంగా ఉంటూనే, ఓ కొత్త కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని రుద్రపాటి రమణారావు అన్నారు. నందమూరి బాలకృష్ణ కథానాయకునిగా రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో ఆయన నిర్మించిన చిత్రం ‘లయన్’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సత్యదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ -‘‘మేం అనుకున్న విధంగా సినిమా బాగా వచ్చింది. రెండు కోణాలున్న పాత్రను బాలకృష్ణగారు బ్రహ్మాండంగా చేశారు. సమయపాలన విషయంలో ఆయన సూపర్బ్. వాస్తవానికి బాలకృష్ణగారితో సినిమా తీయాలనుకున్న తర్వాత ఓ దర్శకుడితో కథ చెప్పించాను. కానీ, అది మామూలుగా ఉందనీ, వేరే కథ ప్రయత్నించమని అన్నారు. అప్పుడు సత్యదేవాని తీసుకెళ్లి, ఈ కథ చెప్పించాను. బాలకృష్ణగారికి అది నచ్చి, ఒప్పుకున్నారు.
ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్లో వచ్చే ట్రైబల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ సినిమాలో హీరో పాత్ర పరంగా ‘లయన్’ అని పెడితేనే బాగుంటుంది. అటు సినిమానీ, ఇటు బాలకృష్ణగారి వ్యక్తిత్వాన్నీ దృష్టిలో పెట్టుకుని పెట్టిన టైటిల్ ఇది. బాలకృష్ణగారు 101వ సినిమా నిర్మించే అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తా’’ అన్నారు.