రమ్ కోసం శింబు పాట
సంచలన నటుడు శింబు రమ్ కోసం గొంతు విప్పారు. ఏమిటీ ఏదేదో ఊహించుకుంటున్నారా? అలాంటిదేమీలేదుగానీ, రమ్ అనే చిత్రం కోసం ఆయన ఒక పెప్పీ పాటను పాడారన్నమాట. శింబుకు పాడడం కొత్తేమీకాదు. అయితే కొన్ని పాటలను రెగ్యులర్ గాయకులు పాడడం కంటే శింబు లాంటి నటులు పాడితే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇక ఆయనకు మరో సంచలన సంగీత దర్శకుడు తోడైతే చె ప్పే అవసరం లేదు.
ఎస్.శింబు, అనిరుద్ల కలయికలో రూపొందిన పాటను త్వరలో వినబోతున్నాం మనం. రమ్ చిత్రం కోసం అనిరుద్ బాణీలు కట్టిన జిబ్బిరిష్ అనబడే పూర్తిగా భావంలేని పేయోఫోబిలియా అనే పల్లవితో కూడిన పాటను శింబు పాడితేనే బాగుంటుందని ఆయన భావించారట. దెయ్యాలకు మనం భయపడాలో కూడదో.. దెయ్యాల కంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం అనే పదజాలాలతో కూడిన గీత రచయిత వివేక్ రాసిన ఈ పాటను శింబు పర్ఫెక్ట్గా పాడారని అనిరుద్ తెలిపారు.
హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న రమ్ చిత్రాన్ని ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు సాయిభరత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హ్రిహికేష్, సంచితాశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్, అజ్మద్, అర్జున్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక ఇంటిలోని అమానుష శక్తుల నేపథ్యంలో జరిగే చిత్రమే రమ్ అని చిత్ర వర్గాలు తెలిపారు.శింబు పాడిన ఈ పాట కచ్చితంగా విశేష ఆదరణను పొందుతుందన్న నమ్మకాన్ని సంగీతదర్శకుడు అనిరుద్ వ్యక్తం చేస్తున్నారు.