Rupee recovers
-
ఆరంభం అదిరింది
ముంబై: కొత్త ఏడాది తొలిరోజు కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. దీంతో సూచీలు ఈ ఏడాది(2022)కి లాభాలతో స్వాగతం పలికాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మన మార్కెట్లు సానుకూలతలను అందిపుచ్చుకున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. దేశీయంగా డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయ గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి రికవరీ కలిసొచ్చింది. దేశంలో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈ పరిణామాలతో ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా.., ఇన్వెస్టర్లు రిస్క్ వైఖరి ప్రదర్శిస్తూ కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి డిసెంబర్ 13వ తేదీ తర్వాత తొలిసారి 59వేల స్థాయి పైన 59,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు ర్యాలీ చేసి 17,626 వద్ద నిలిచింది. తద్వారా మూడు వారాల్లో సూచీలు అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. అలాగే సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ షేర్లలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. చిప్ కొరత కష్టాలను అధిగమిస్తూ వాహన కంపెనీలు పరిశ్రమ అంచనాలకు మించి అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.903 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే నష్టాలను రికవరీ చేసుకొని రూపాయి మూడు పైసలు బలపడి 74.26 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆర్థిక రివకరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఏడాది తొలి సెషన్లో లాభాల బాటపట్టాయి. బ్రిటన్, చైనా, జపాన్ ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు. గతేడాదిలో 27 శాతం లాభాల్ని పంచిన అమెరికా మార్కెట్లు అదే జోష్‌ను కనబరుస్తూ లాభాలతో కదలాడుతున్నాయి. రోజంతా లాభాలే... స్టాక్ సూచీలు 2022 ఏడాది తొలి రోజు ట్రేడింగ్‌ను లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 58,310 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 17,387 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విస్తృత కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,012 పాయింట్లు ర్యాలీ చేసి 59,266 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు దూసుకెళ్లి 17,647 వద్ద గరిష్టాల తాకాయి. ఇవి సూచీలకు ఆరు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చివరిదాకా కొనుగోళ్లకే కట్టబడటంతో సూచీలు ఏ దశలో వెనకడుగు వేయలేదు. రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో కొత్త ఏడాది తొలి రోజు రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లుగా నమోదైంది. ‘వ్యాక్సిన్ వేగవంతం చర్యల నుంచి బుల్ జోష్‌ను అందిపుచ్చుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. కోవిడ్ సంబంధిత వార్తలు, ప్రపంచ మార్కెట్ల తీరు రానున్న రోజుల్లో సూచీ ల గమనాన్ని నిర్దేశిస్తాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ వరుసగా మూడో రోజూ బలపడటం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీ సాంకేతికంగా అప్‌ట్రెండ్‌లో 17,750 స్థాయి వద్ద కీలక నిరోధం ఉండొచ్చు’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు n డిసెంబర్లో ఉత్పత్తి పెరిగిందనే కంపెనీ ప్రకటనతో కోల్ ఇండియా షేరు ఆరు శాతానికి పైగా లాభపడి రూ.155 వద్ద స్థిరపడింది. n ఎన్సీడీల ద్వారా రూ.456 కోట్లను సమీకరించడంతో ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ షేరు ఐదుశాతం పెరిగి రూ.75 వద్ద ముగిసింది. n ఐటీ షేర్లలో భాగంగా టీసీఎస్ షేరు రాణించింది. బీఎస్ఈలో రెండు శాతం లాభపడి రూ.3,818 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రెండున్నర ర్యాలీ చేసి రూ.3829 వద్ద 13 వారాల గరిష్టాన్ని అందుకుంది. -
మళ్లీ రికార్డుల వేట..!
ముంబై: రెండురోజుల పాటు వెనకడుగు వేసిన బుల్స్ మళ్లీ పరుగును ప్రారంభించాయి. దీంతో స్టాక్ మార్కెట్లో తిరిగి రికార్డుల వేట మొదలైంది. టీసీఎస్ క్యూ3 ఫలితాలకు ముందు ఐటీ షేర్ల ర్యాలీ, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, రూపాయి రికవరీ వంటి అంశాలతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 48,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14,347 వద్ద నిలిచింది. లాభాల మార్కెట్లోనూ మెటల్, ప్రభుత్వ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 761 పాయింట్లను ఆర్జించి 48,854 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 14,367 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.24 వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 329 పాయింట్ల పెరిగింది. యూఎస్ తదుపరి అధ్యక్షుడిగా జో బెడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఆర్థిక ఉద్దీపన ప్రకటన అంచనాలు మరింత పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానానికే మొగ్గుచూపుతూ వడ్డీరేట్ల తగ్గింపునకే ఓటేస్తున్నాయి. ఫలితంగా వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి అది క్రమంగా ఈక్విటీ మార్కెట్లోకి ప్రవహిస్తుంది. దేశీయంగా డిసెంబర్ ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీ ప్రతిబింబిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ కంపెనీ టీసీఎస్ షేరు మూడుశాతం లాభపడి రూ.3,121 వద్ద ముగిసింది. ► మారుతి సుజుకీ, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు 6 శాతం చొప్పున పెరిగాయి. ► అనుబంధ సంస్థ బయోసిమిలర్లో అబుధాబీకి చెందిన ఏడీక్యూ ఇన్వెస్ట్మెంట్ రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో బయోకాన్ షేరు రెండు శాతం లాభపడింది. ► వ్యక్తిగత, వాణిజ్య వాహనాలపై పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► క్యూ3 మెరుగైన ఫలితాలను సాధించవచ్చనే అంచనాలతో సన్ ఫార్మా షేరు 3 శాతం లాభపడటమే కాక రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. -
భారీ పతనం నుంచి కోలుకుంది
ముంబై : ఆల్-టైమ్ కనిష్ట స్థాయిలకు పతనమైన రూపాయి విలువ, శుక్రవారం ట్రేడింగ్‌లో కోలుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో 18 పైసలు బలపడి 68.61గా నమోదైంది. బ్యాంకులు, ఎగుమతి దారులు అమెరికా కరెన్సీ డాలర్‌ను విక్రయించడంతో, రూపాయి భారీ పతనం నుంచి తేరుకుంది. ప్రస్తుతం 24 పైసల లాభంలో 68.56గా ట్రేడవుతోంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి మొట్టమొదటిసారి 69 స్థాయిన అధిగమించేసి ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి మారింది. ద్రవ్యోల్బణం తీవ్రతరమవడంతో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందనే భయాలు, వాణిజ్య యుద్ధ భయాలు, చమురు ధరల తీవ్రత ఇవన్నీ రూపాయిని బలహీనపడేలా చేశాయి. అయితే క్షీణిస్తున్న రూపాయి విలువను కాపాడేందుకు బ్యాంకులు, ఎగుమతి దారులు డాలర్ అమ్మకాలు చేపట్టారు. అంతేకాక అంతర్జాతీయంగా కొన్ని కరెన్సీలకు వ్యతిరేకంగా గ్రీన్బ్యాక్ కరెన్సీ(డాలర్) బలహీనడపిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో పైకి ఎగియడం కూడా రూపాయికి సహకరించింది. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల నుంచి కోలుకుని 142 లాభంలో, 35,180 వద్ద ట్రేడైంది. -
రూపాయి మరింత డౌన్
ముంబై: రెండు రోజుల లాభాల అనంతరం రూపాయి బుధవారం మరో కొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 61.30 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం నాటి 61.10 తర్వాత ఇది కొత్త కనిష్ట స్థాయి ముగింపు. డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్.. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఉపసంహరించే అవకాశాలున్నాయన్న సంకేతాలు, మరిన్ని విదేశీ నిధులు తరలిపోతుండటం సైతం రూపాయి బలహీనతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ 60.90-61.90 శ్రేణిలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.