మళ్లీ రికార్డుల వేట..! | Sensex jumps 689 points and Nifty settles above 14,300 points | Sakshi
Sakshi News home page

మళ్లీ రికార్డుల వేట..!

Published Sat, Jan 9 2021 5:41 AM | Last Updated on Sat, Jan 9 2021 5:41 AM

Sensex jumps 689 points and Nifty settles above 14,300 points - Sakshi

ముంబై: రెండురోజుల పాటు వెనకడుగు వేసిన బుల్స్‌ మళ్లీ పరుగును ప్రారంభించాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లో తిరిగి రికార్డుల వేట మొదలైంది. టీసీఎస్‌ క్యూ3 ఫలితాలకు ముందు ఐటీ షేర్ల ర్యాలీ, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, రూపాయి రికవరీ వంటి అంశాలతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్‌ 689 పాయింట్ల లాభంతో 48,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14,347 వద్ద నిలిచింది.

లాభాల మార్కెట్లోనూ మెటల్, ప్రభుత్వ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 761 పాయింట్లను ఆర్జించి 48,854 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 14,367 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.24 వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 913 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 329 పాయింట్ల పెరిగింది.  

యూఎస్‌ తదుపరి అధ్యక్షుడిగా జో బెడెన్‌ ఎన్నికను అమెరికా కాంగ్రెస్‌ అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఆర్థిక ఉద్దీపన ప్రకటన అంచనాలు మరింత పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కోవిడ్‌ సహాయక చర్యల్లో భాగంగా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానానికే మొగ్గుచూపుతూ వడ్డీరేట్ల తగ్గింపునకే ఓటేస్తున్నాయి. ఫలితంగా వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి అది క్రమంగా ఈక్విటీ మార్కెట్లోకి ప్రవహిస్తుంది. దేశీయంగా డిసెంబర్‌ ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీ ప్రతిబింబిస్తున్నాయి.

స్టాక్‌ మార్కెట్‌ మరిన్ని విశేషాలు...  
► మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ కంపెనీ టీసీఎస్‌ షేరు మూడుశాతం లాభపడి రూ.3,121 వద్ద ముగిసింది.  
► మారుతి సుజుకీ, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు 6 శాతం చొప్పున పెరిగాయి.  
► అనుబంధ సంస్థ బయోసిమిలర్‌లో అబుధాబీకి చెందిన ఏడీక్యూ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో బయోకాన్‌ షేరు రెండు శాతం లాభపడింది.  
► వ్యక్తిగత, వాణిజ్య వాహనాలపై పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు 4% లాభపడి ఏడాది గరిష్టాన్ని అందుకుంది.  
► క్యూ3 మెరుగైన ఫలితాలను సాధించవచ్చనే అంచనాలతో సన్‌ ఫార్మా షేరు 3 శాతం లాభపడటమే కాక రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement