ముంబై, సాక్షి: ఈక్విటీలలో ఎఫ్‌పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగసి 46,890 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగో రోజూ చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. బుధవారం వరుసగా రెండో రోజు నాస్‌డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద నిలిచింది. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 46,992 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,773 వద్ద సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం!
ఎఫ్‌ఎంసీజీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా 0.5 శాతం చొప్పున బలపడగా.. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్, శ్రీసిమెంట్, ఇండస్‌ఇండ్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హిందాల్కో, కోల్ ఇండియా, మారుతీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్ 2.2-1.2 శాతం మధ్య నీరసించాయి.
జూబిలెంట్ అప్
డెరివేటివ్స్‌లో జూబిలెంట్ ఫుడ్, పేజ్, కెనరా బ్యాంక్, ఎస్‌ఆర్‌ఎఫ్, బెర్జర్ పెయింట్స్, బీఈఎల్ 5.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు సెయిల్, బీవోబీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఆర్‌ఈసీ, జీ, జిందాల్ స్టీల్, నాల్కో, ఆర్‌బీఎల్ బ్యాంక్, హెచ్‌పీసీఎల్ 5-2.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్స్ 0.25 శాతం డీలాపడింది. ట్రేడైన షేర్లలో 1,387 లాభపడగా.. 1,584 నష్టాలతో నిలిచాయి.
ఎఫ్‌ఫీఐల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,718 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment